అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నట్టుగా తయారైంది పాపం.. తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరిస్థితి. ఎమ్మెల్యేగా ఉండగా, తిరుపతిలో టిడిఆర్ బాండ్ల రూపేణా తాను కాజేయదలుచుకున్న కోట్లాది రూపాయలకు అడ్డం వచ్చినందుకు ఆగ్రహించిన భూమన కరుణాకర్ రెడ్డి.. అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి మీద ఇటీవల ప్రత్యేకంగా ఒక వీడియో విడుదల చేసి నిప్పులు చెరగిన విషయం అందరికీ తెలిసిందే. వై శ్రీ లక్ష్మీ పేరు ప్రస్తావించలేదు గాని అన్ని రకాలుగాను ఆమెను గుర్తు చేస్తూ భూమన కరుణాకర్ రెడ్డి ఆమె అవినీతి బాగోతాల గురించి ఒక రేంజ్ లో ధ్వజమెత్తారు. అయితే తాజాగా రాజమహేంద్రవరం జైలులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ములాఖత్ రూపంలో పరామర్శించి వచ్చిన భూమన విలేకరులతో మాట్లాడుతూ ఐఏఎస్ శ్రీలక్ష్మిని తాను ఒక్క మాట కూడా అనలేదని బుకాయించే ప్రయత్నం చేయడం గమనార్హం. ఆవేశంలో ఆమెను ఎడాపెడా తూలనాడిన భూమన ఇప్పుడు నాలుక కరుచుకుని తప్పుదిద్దుకోవడానికి, ఆమెను ఒక్క మాట కూడా అనలేదని బుకాయించడానికి వెనుక పెద్ద గ్రంథమే నడిచినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి భూమన కరుణాకర్ రెడ్డికి తలంటడం జరిగిందని పార్టీలో తన భవిష్యత్తును కాపాడుకోవడానికి ఈ సంజాయిషీ చెప్పుకుంటున్నారని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
భూమన కరుణాకర్ రెడ్డి చాలా తీవ్రమైన భాషలో శ్రీ లక్ష్మీ గురించి విమర్శలు కురిపించారు. ఆమెను అవినీతి అనకొండ గా అభివర్ణించారు. లంఖిణి, పూతన లాంటి రాక్షసుల పేర్లతో తీవ్రంగా నిందించారు. అయితే భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సరే గంటల తరబడి లైవ్ ఇస్తుండే సాక్షి ఛానల్ ఆయన విడుదల చేసిన శ్రీలక్ష్మి వీడియోను ఒక్క నిమిషం కూడా ప్రసారం చేయలేదు. సాక్షి పత్రికలో ఆయన విమర్శల ప్రస్తావనే లేదు. ఆ మీడియా గ్రూపు మొదటిసారిగా భూమనను పూర్తిగా పక్కన పెట్టింది. ఈలోగా శ్రీలక్ష్మి అవినీతి గురించి భూమన వ్యాఖ్యలకు ఇతర చానల్స్ ఒక రేంజిలో ప్రచారం కల్పించాయి. శ్రీలక్ష్మి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి తన ఆవేదనను పంచుకున్నట్లుగా పుకార్లు వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాల్పడిన సకల అవినీతి కార్యకలాపాలకు శ్రీలక్ష్మి తన వంతు అండదండగా నిలుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికేసులను ఆమె ఇంకా కోర్టుల్లో ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా భూమన మాట్లాడడాన్ని సహించలేకపోయిన జగన్ సీరియస్ అయినట్లుగా సమాచారం. పార్టీ పెద్దల ద్వారా భూమనను మందలించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద భూమన కరుణాకర్ రెడ్డి శ్రీ లక్ష్మీ గురించి తాను ఎలాంటి విమర్శలు చేయలేదని సంజాయిషీ చెప్పుకోవడం జరిగినట్లుగా పలువురు భావిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ కెరియర్ ఒకరకంగా ముగిసినట్లే. అయితే తన కొడుకును తిరుపతి ఎమ్మెల్యేగా చూసుకోవాలనే తాపత్రయమున్న భూమన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమ కుటుంబాన్ని లూప్ లైన్ లో పెట్టకుండా ఉండేందుకు జగన్ కు వచ్చిన కోపాన్ని ఉపశమింప చేసేందుకు ఇలా శ్రీలక్ష్మిని తాను ఏమీ అనలేదు అంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నట్టుగా పలువురు అంచనా వేస్తున్నారు.