జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో ఒక్క రూపాయి కూడా పింఛను పెంచకుండా వికలాంగులను ఎంత దారుణంగా వంచించారో అందరికీ తెలుసు. అలాంటిది చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే ఆ పెన్షన్ రెట్టింపు చేసి 6000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. చెప్పినట్లే మాట నిలబెట్టుకుని ఇస్తున్నారు కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో అయిన వారికి తమ కార్యకర్తలకు దోచిపెట్టడానికి వికలాంగుల పెన్షన్ అనే విధానాన్ని కూడా హేయమైన పద్ధతిలో వాడుకున్న తీరు గురించి అప్పట్లోనే అనేక విమర్శలు వచ్చాయి. అలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రీ వెరిఫికేషన్ కు ఆదేశించింది.
ఈ క్రమంలో అర్హులైన కొందరు వికలాంగులకు కూడా పెన్షన్లు ఆగడం జరిగింది. అయితే ఇది తాత్కాలికం మాత్రమే అని గుర్తించాలి. రీ వెరిఫికేషన్ ప్రాసెస్ సక్రమంగా జరగలేదని అర్హులకు పెన్షన్లు కోల్పోతున్నారని అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో.. పొరబాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి సదాసిద్ధంగా ఉండే చంద్రబాబు నాయుడు అధికారులకు తదనుగుణమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే ఈలోగానే ఈ అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనే వక్రబుద్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తుండడం గమనించాల్సిన సంగతి.
‘మీ బతుకంతా మోసమేనా’ అంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ఖాతా ద్వారా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. వికలాంగుల పెన్షన్ల విషయంలో ఎవరికైనా అన్యాయం జరిగి ఉంటే వాటన్నింటినీ సర్దుబాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించిన తరువాత జగన్ మేలుకొని ఇలాంటి విమర్శలు చేయడం చాలా తమాషాగా ఉంది.
వికలాంగులను కష్టపెట్టడం మానవత్వం అనిపించుకుంటుందా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తన పరిపాలన అంత్యదశలో ఉన్న కాలంలో వృద్ధాప్య పెన్షన్లను.. ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకు అందించకుండా, తాను వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వైనం ప్రజలు మరిచిపోయారని జగన్ భ్రమిస్తున్నట్లుగా ఉంది. ఆ రోజున సర్టిఫికెట్లు ఇచ్చింది ఇదే గవర్నమెంట్ డాక్టర్లు అయినప్పుడు అవి తప్పుడు సర్టిఫికెట్లు ఎలా అవుతాయి అని జగన్ మోహన్ రెడ్డి పెద్ద లాజిక్ లేవనెత్తుతున్నారు. లంచాల కోసం డాక్టర్లు ఆశపడ్డారంటూ తప్పుడు ప్రచారం చేయడం దారుణం కాదా అని లేని అంశాన్ని ప్రస్తావనకు తెచ్చి ప్రభుత్వం మీద వైద్యుల్లో దురభిప్రాయం కలిగించేందుకు జగన్ తపన పడుతున్నారు. దివ్యాంగులను ఇబ్బంది పెట్టి వారి బలవన్మరణాలకు పాల్పడేలా చేస్తున్నారనిఅంటున్న జగన్ ఆ మాటల ద్వారా ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒకవైపు దివ్యాంగుల పెన్షన్ల విషయంలో జరిగిన తేడాలను సరిదిద్దుడానికి ప్రభుత్వం పూనుకున్న తర్వాత ఆయన ఇలా మాట్లాడడం కేవలం రాజకీయ అవకాశవాదం అనుకోవాల్సిందే.
అయితే వాస్తవానికి డాక్టర్లు లంచాల కోసం ఆశపడి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారనేది కాదు.. ఆ రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిళ్లు బెదిరింపులకు భయపడి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారనే సంగతిని ప్రజలు గుర్తు చేస్తున్నారు. వైసీపీ పాలనలో తప్పుడు సర్టిఫికెట్లతో అనేకమంది పెన్షన్ల అర్హతలను సృష్టించుకున్న వైనం క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలుసు. అయితే అవన్నీ డాక్టర్ల అవినీతి కారణంగా పుట్టిన దొంగ సర్టిఫికెట్లు కాదని, వైసీపీ నాయకుల అరాచక బెదిరింపుల కారణంగా తయారైనవి అని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు రివెరిఫికేషన్ రూపంలో కూటమి ప్రభుత్వం అన్నింటినీ పక్కాగా నిగ్గుతేలిస్తే గతంలో వైసిపి పాల్పడిన అరాచకాలని వెలుగులోకి వస్తాయనేది జగన్మోహన్ రెడ్డి భయంగా అందరికీ కనిపిస్తుంది. తన భయాన్ని దాచి పెట్టుకోవడానికి ఆయన చంద్రబాబు మీద విమర్శలు చేస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.