‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అనే సామెత తెలుగు ప్రజలకు అలవాటు అయిపోయింది. తేడా గాడైన ఒక దొంగ పోలీసుల్ని వెంటపడి తరిమాడని ఈ సామెత అర్థం అయితే ఇలాంటి పోకడనే కొంచెం భిన్నంగా ప్రదర్శిస్తున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి. దెయ్యాలు వేదాలు వల్లించిన తరహాలో ఇప్పుడు పోలీసుల ఆత్మగౌరవం గురించి, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినడం గురించి, వారి మర్యాద గురించి ఆయన మాట్లాడుతున్నారు. తన మీద పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు.. నడిబజార్లో పోలీసుల బట్టలు ఊడదీయించి కొడతానని బహిరంగంగా ప్రకటించిన ఈ మాజీ మంత్రి తాజాగా ఎక్కడో జరిగిన ఒక వ్యవహారానికి సంబంధించి.. పోలీసుల పరువు పోతున్నదని మొసలికన్నీరు కారుస్తూ ఫిర్యాదు చేయడం చాలా చవకబారుగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
అనకాపల్లి జిల్లా దొండపూడిలో ఇటీవల ఒక సంఘటన జరిగింది. స్పీకరు అయ్యన్నపాత్రుడు అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు ఎస్కార్టు వాహనం రావడం ఆలస్యమైంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకరుకు ఎస్కార్టు ఆలస్యం కావడం అనేది ఊహించలేని సంగతి. ఈ విషయంలో ఆయన స్థానిక పోలీసులను కోప్పడ్డారు. జరిగింది అంతే! కానీ.. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన నాటినుంచి పోలీసులన ఒక రేంజిలో తూలనాడడం బాగా అలవాటు చేసుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు దీనిని అవకాశంగా మలచుకోదలచుకున్నట్టున్నారు. అయ్యన్నపాత్రుడు పోలీసులను నానా తిట్లు తిట్టారని అంటూ.. పోలీసులపై కపటప్రేమను ప్రదర్శిస్తున్నారు. తన మీద ఉన్న అవినీతి కేసుల్లో బెయిలుపై ఉండి వారానికి ఒకసారి నెల్లూరుకు వెళ్లి పోలీసుల ముందు హాజరు వేసుకుంటున్నమ మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి.. ఒక అడుగు ముందుకు వేసి.. పోలీసులను తిట్టిన అయ్యన్నపాత్రుడుపై కేసు పెట్టడం ఇంకా చిత్రం.
ఎక్కడో అనకాపల్లి జిల్లాలో చిన్న సంఘటన జరిగితే.. నెల్లూరులో వేదాయపాలెం పోలీసుల వద్ద కాకాణి కేసు పెట్టడం కామెడీ కాక మరేమిటి? అని ప్రజలు అనుకుంటున్నారు. అంతకంటె ప్రజలు నివ్వెరపోతున్న అంశం ఏంటంటే.. నెల్లూరులో పోలీసుల బట్టలూడదీయించి కొడతానని ఇదే కాకాణి గతంలో నీచమైన వ్యాఖ్యలు చేశారు. పాపిరెడ్డి పల్లె పర్యటన సందర్భంగా రెచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి కూడా.. బట్టలిప్పదీసి నిలబెడతామంటూ వ్యాఖ్యానించారు. దిక్కూమొక్కూలేని ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మామూలు ఎమ్మెల్యేలే అలా మాట్లాడినప్పుడు.. రాజ్యాంగబద్ధ పదవిలోని వ్యక్తి.. ఎస్కార్ట్ ఆలస్యంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించకపోవడం కూడా కరెక్టు కాదు కదా? అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. ఇలాంటి కపట ప్రేమను ప్రదర్శించినంత మాత్రాన.. ఈ వైసీపీ నాయకుల తిట్లను పోలీసులు మరచిపోరని, వారిపట్ల ప్రేమను పెంచుకోరని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.