భూమన ‘తాటకి మాటలు’.. జగన్ అవినీతిని తేలుస్తున్నట్టే!

తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మీడియా వాళ్లు తమను ప్రశ్నలు అడుగుతారని భయపడుతున్నప్పుడు.. వారు అడిగే ప్శశ్నలకు తమ వద్ద జవాబులు లేవని ఆందోళన చెందుతున్నప్పుడు.. ఇంట్లోనే కూర్చుని ఒక వీడియో విడుదల చేసేసి చేతులు దులుపుకోవడం మామూలే! భూమన కరుణాకర రెడ్డి కూడా ఇవాళ అలాంటి పనే చేశారు.

రెండేళ్లుగా తనలో ఒక విషయం నలుగుతున్నదని, ఆ విషయంలో  మధనపడుతున్నానని అంటూ.. ఒక మహిళా ఐఏఎస్ అధికారి గురించి చాలా తీవ్రమైన వ్యాఖ్యాలతో విరుచుకుపడ్డారు. కానీ.. విషయం ఏంటంటే.. భూమన కరుణాకర రెడ్డి.. తన మహిళా విలన్లను, రాక్షసులను గుర్తుచేసే పురాణపాత్రల పరిజ్ఞానాన్నంతా ప్రదర్శించి ఏ ఐఎఎస్ అధికారినైతే తూలనాడారో.. ఆమె జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వసనీయమైన అధికారిణి! ఆమె అవినీతి గురించి.. ఎడాపెడా తిట్టడం అంటే.. డైరక్టుగా ఆమెను నెత్తిన పెట్టుకుని ఊరేగిన జగన్మోహన్ రెడ్డిని అవినీతిపరుడుగా ప్రొజెక్టు చేయడమే అని పలువురు విశ్లేషిస్తున్నారు.

తిరుపతిలో మునిసిపల్ శాఖ మంత్రి టీడీఆర్ బాండ్ల కుంభకోణం గురించి మాట్లాడిన తర్వాత.. తన జమానాలో కూడా అలాంటి అవినీతి పెద్దస్థాయిలో జరిగినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమన కరుణాకర రెడ్డి.. వీడియో విడుదల చేశారు. ప్రపంచంలో ఏం జరిగినా సరే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబునాయుడుకు ముడిపెట్టి తిట్టడాన్ని అలవాటుగా చేసుకున్న భూమన.. ఈ వీడియోలో మాత్రం పూర్తిగా ఐఏఎస్ అధికారిణిని టార్గెట్ చేశారు. జగన్ జమానాలో మునిసిపల్ శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో ఉన్న ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి పేరు ప్రస్తావించకుండా భూమన ఒకరేంజిలో తిట్టిపోశారు. ఆమె తాటకి, పూతన, లంకిణి అంటూ శాపనార్థాలు పెట్టారు. అవినీతి అనకొండ అన్నారు. వందల కోట్లు తినేసిందని కూడా ఆయన ఆరోపించారు.

అయితే సదరు వై శ్రీలక్ష్మి.. ఐఏఎస్ గా సర్వీసులోకి వచ్చిన నాటినుంచి విపరీతమైన ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆమె అవినీతి గురించి ఆమె పనిచేసిన ప్రతిచోటా కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా సాగినంత కాలమూ.. శ్రీలక్ష్మి అవినీతి పీక్స్ కు చేరింది. గాలి జనార్ధన రెడ్డి అక్రమ మైనింగ్ ల్లోనూ ప్రధానపాత్ర ఆమెదే. రాష్ట్ర విభజన తర్వాత.. వై శ్రీలక్ష్మి తెలంగాణ సర్వీసులకు వెళ్లారు. కానీ.. జగన్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే.. పనిగట్టుకుని ఆమెను ఏపీ సర్వీసులోకి తీసుకున్నారు. కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాసి మరీ.. పదవిలోకి తెచ్చారు.

కీలక శాఖలు అప్పగించారు. అత్యంత విశ్వసనీయులైన ఐఏఎస్ ల జాబితాలో పెట్టుకున్నారు. మునిసిపల్ శాఖలో కీలకంగా ఉంటూ టీడీఆర్ బాండ్ల రూపంలో వందల కోట్లు కాజేసినట్టుగా ఇప్పుడు ఆమె గురించి.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆరోపిస్తున్నారు. అదే నిజమైతే.. ఆమెను నెత్తిన పెట్టుకుని.. ఆయా కీలక శాఖలు అప్పగించిన జగన్ రెడ్డి వాటాలు పుచ్చుకోకుండా ఉంటారా? భూమన తన ఆరోపణల ద్వారా.. జగన్ ను కూడా టార్గెట్ చేస్తున్నట్టేనా? అని పలువురు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories