పార్టీకి యువరక్తం ఎక్కించడం మీదనే ఫోకస్!

ఒక పార్టీ సరైన రీతిలో పెర్ఫార్మ్ చేయాలంటే.. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎంత అవసరమో యువరక్తం కూడా అంతే అవసరం. ఒకవైపు సీనియర్ల అనుభవాన్ని, పెద్దరికాన్ని, మార్గదర్శనాన్ని బాగా వాడుకుంటూనే.. అదే సమయంలో.. యువనాయకుల చేతిలో సారథ్యం పెట్టడం అనేది ఒక పార్టీ అద్భుతమైన ప్రస్థానం సాగించడానికి గొప్పగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు అదే సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నారు. కొత్త నేతల చేతుల్లోనే పార్టీ సారథ్యం పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.

అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగత నిర్మాణంపై అధినేత చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తున్నారు. క్షేత్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయంగా భవిష్యత్తు స్థిరంగా ఉంటుందని సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉన్న పార్టీ తెలుగుదేశం. కేవలం కార్యకర్తల బలం సంస్థాగత నిర్మాణం చక్కగా ఉన్న కారణం చేత మాత్రమే సుదీర్ఘకాలంగా ఎన్ని ఎత్తుపల్లాలు ఎదురవుతున్నా దెబ్బతినకుండా మనుగడ సాగిస్తున్న పార్టీ ఇది. చంద్రబాబు నాయుడు ఇంచుమించుగా 50 ఏళ్ల ప్రాయానికి దగ్గరవుతున్న పార్టీకి ఇప్పుడు అటు అనుభవం, ఇటు యువ రక్తం కలగలిసిన నాయకత్వాన్ని నిర్మించే పనిలో ఉన్నారు.

పార్టీ పార్లమెంటరీ కమిటీల నిర్మాణానికి సంబంధించి నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ఈ రకమైన సంకేతాలు ఇచ్చారు. సీనియర్ల సేవలను అనుభవాన్ని వాడుకుంటూనే కొత్తవారికి కూడా పార్టీ నాయకత్వంలో చోటు కల్పించడం ద్వారా పార్టీని మరింతగా ప్రజలతో మమేకం చేసేందుకు ఒక నిర్దిష్టమైన వ్యూహం ప్రకారం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. పార్టీ కమిటీల నిర్మాణంలో సోషల్  ఇంజినీరింగ్ కూడా ఉండాలని అంటూ, అన్ని కులాలకు వర్గాలకు సమప్రాధాన్యం దక్కాలనే సంకేతాలు ఇస్తున్నారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో మొహమాటాలకు పోయి డమ్మీలు, బలహీనుల్ని ఎంపిక చేస్తే.. ప్రభుత్వం, పార్టీ రెండూ నష్టపోతాయనే వాస్తవాన్ని చంద్రబాబు ఉద్బోధిస్తున్నారు. ఖచ్చితంగా కష్టపడి పార్టీకోసం పనిచేయగలిగేవారు, కిందిస్థాయి ప్రజలతోమమేకం కాగలిగేవారు.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగేవారే.. పార్టీ సారథులుగా ఉన్నప్పుడు మెరుగైన ఫలితాలు వస్తాయనే విశ్వాసంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే పార్టీని రీఆర్గనైజ్ చేయడంలో యువతకు అవకాశాలు ఇస్తున్నాం అని చంద్రబాబు చెబుతుండడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories