రాజకీయ నాయకులు తెలివి మీరిపోతున్నారు. తమ మీద ఆరోపణలు వచ్చినప్పుడు దమ్ముంటే నిరూపించండి.. అంటూ సవాళ్లు విసరడం చాలా సాధారణమైన సంగతి. నిరూపణలు, ఆధారాలతో సహా వారు పాల్పడిన తప్పుడు పని బయటకు వచ్చినప్పుడు.. ఇన్నాళ్లూ నోరు మెదపకుండా సైలెంట్ గా ఉండిపోయేవారు. ఇప్పుడు.. అలా జరగడం లేదు. సాక్ష్యాలతో సహా తమ తప్పు బయటపడినా సరే.. ప్రెస్ మీట్ పెట్టి మరీ తాము పరిశుద్ధులం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే ఇలాంటి వ్యవహార సరళిని ప్రదర్శిస్తుండడం గమనార్హం.
నెల్లూరు జిల్లాలో రౌడీషీటరు శ్రీకాంత్ కు పెరోల్ లభించడం అనేది రాష్ట్రవ్యాప్తంగా కొన్ని రోజులుగా ఎంత పెద్ద సంచలనం నమోదు చేస్తున్నదో అందరికీ తెలుసు. ఐపీఎస్ లలో కొందరు కీలక అధికారుల ఉద్యోగాలకే ఎసరు వస్తుందనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. అయితే తెలుగుదేశం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చిత్రంగా కనిపిస్తున్నాయి.
శ్రీకాంత్ కు బెయిలు రావడానికి ఇద్దరు తెలుగుదేశం ఎమ్మెల్యేలే సిఫారసు ఉత్తరాలు ఇచ్చినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరో పేర్లు రాయడానికి కూడా పత్రికలు సాహసించలేదు. మొత్తానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ లు ఈ లేఖలు ఇచ్చినట్టుగా బయటకు వచ్చింది. వీరిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సీరియస్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. పార్టీకి నష్టం కలిగించేలా, ప్రభుత్వం పరువు తీసేలా ఏ పనిచేసినా సరే.. ఎంత పెద్దవారినైనా వదిలిపెట్టేది లేదని వారిని చంద్రబాబు హెచ్చరించినట్టుగా వార్తలు వచ్చాయి.
తాజాగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. తాము ఇద్దరమూ పెరోల్ కోసం లేఖలు ఇచ్చామని, అయితే పెరోల్ ఇవ్వడానికి కుదర్దు అని జైలు అధికారులు తమకు తేల్చిచెప్పేశారని ఆయన అంటున్నారు. తమ లేఖలను తిరస్కరించిన తర్వాత.. పద్నాలుగు రోజులకు శ్రీకాంత్ కు పెరోల్ లభించిందని, ఆయనకు పెరోల్ ఇప్పించిన అధికారులు ఎవరో తేలాలని కోటంరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఆ అధికారులు ఎవరో తేల్చడానికి ప్రయత్నిస్తున్నాం అని హోంమంత్రి అనిత కూడా చెప్పారని అన్నారు.
ఆయన చెబుతున్నదంతా నిజమే అని అనుకుందాం. అధికారులే పెరోల్ ఇప్పించారు.. ఓకే. వారెవ్వరో తేలుస్తారు.. అదికూడా ఓకే! అయినంత మాత్రాన కోటంరెడ్డి, పాశం ఇద్దరూ పరిశుద్ధులు అయిపోతారా? అనేది ప్రజల సందేహం. అనేకానేక కేసుల్లో నిందితుడైన ఒక హంతకుడికి, కరడుగట్టిన రౌడీషీటరుకు పెరోల్ కావాలని సిఫారసు ఉత్తరాలు ఇచ్చిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఖచ్చితంగా గర్హనీయం. ఇక మీదట ఎవ్వరికీ పెరోల్ కోసం ఉత్తరం ఇవ్వను అని కోటంరెడ్డి అంటున్నారు. ఇలా సమర్థించుకున్నంత మాత్రాన ఆయన మంచివాడు అయిపోరు. పెరోల్ రావడంలో అధికారుల పాత్ర గురించి.. పోలీసులు చూసుకుంటారు. కానీ.. తాను అలాంటి లేఖ ఇచ్చినందుకు ప్రజలకు కోటంరెడ్డి క్షమాపణ చెప్పాలని అంతా కోరుకుంటున్నారు.