వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో అయిదేళ్లపాటు నిరీక్షణలో గడిపి నిరాశతోనే ముగించిన నిరుద్యోగ ఉపాధ్యాయులకు.. తాము అధికారంలోకి వచ్చీ రావడంతోనే శుభవార్తను ప్రకటించింది.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. 16347 టీచరు పోస్టుల ఖాళీలను ప్రకటించి భర్తీ చేశారు కూడా. చంద్రబాబు వీరికి ప్రకటించిన వరం ఫలం అందుతున్న రోజునే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరొక వరం ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిపుష్టం చేయడానికి ఇకపై ప్రతియేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేష్ అంటున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది అతిగొప్ప వరం అనడంలో సందేహం లేదు.
తల్లికి వందనం చివరి విడత దరఖాస్తులను కూడా ఆమోదిస్తూ మరొక 325 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టుగా కూడా లోకేష్ వెల్లడిస్తున్నారు. విద్యారంగంలో తీసుకు రానున్న అనేక సంస్కరణల గురించి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వాటిలో ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహించడం పట్ల ప్రభుత్వ కృతనిశ్చయాన్ని లోకేష్ వెల్లడించడం చాలా కీలకమైనది. ఎందుకంటే.. నెల్లూరు వీఆర్ హైస్కూలు తరహాలో అత్యాధునిక వసతులను, డిజిటల్ తరగతి గదులు లాంటి హంగులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ పాఠశాలలకు అవసరమే. అలాంటి హంగులన్నీ ఉండడం వలన.. ప్రెవేటు పాఠశలాలకు వెళుతున్న మధ్య తరగతి వారు కూడా చాలా శ్రద్ధగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే అవకాశం ఉంటుంది. కానీ కేవలం సాంకేతిక హంగులు మాత్రమే చాలు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా.. టీచర్లు కూడా ఉండాలి. అలాగే ఒక ఏడాదిలో ఎన్ని టీచరు పోస్టులు ఖాళీ అవుతాయో.. అవి వెంటనే భర్తీ అవుతూ ఉండాలి. ఒక పాఠశాలలో చాలినంత మంది టీచర్లు ఉన్నప్పుడు మాత్రమే.. వారు విద్యార్థుల మీద అవసరమైనంతగా శ్రద్ధపెట్టగలుగుతారు. అలా జరిగినప్పుడే.. వసతులు, సాంకేతిక సదుపాయాలు కొంచెం అటుఇటుగా ఉన్నా కూడా.. ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతారు.
కానీ గతంలో వైఎస్ జగన్ సర్కారు.. అయిదేళ్ల పాలన సాగించి కూడా.. ఒక్కటంటే ఒక్కటైనా టీచరు పోస్టును భర్తీ చేయనేలేదు. ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించనేలేదు. ఎన్నికలు ముంచుకువచ్చిన తర్వాత.. టీచర్లలో అసంతృప్తి తమ కొంపముంచుతుందని భయపడి డీఎస్సీ పేరుతో ఒక ప్రహసనం నడిపించారు గానీ.. అదికూడా పూర్తి చేయలేదు. ఇలా అన్ని రకాలుగానూ నిరుద్యోగ ఉపాధ్యాయులను వంచించారు. కానీ.. నారా లోకేష్ తమ కూటి ప్రభుత్వం ప్రతి ఏడాదీ డీఎస్సీ నిర్వహిస్తుందని ప్రకటించడం.. కేవలం నిరుద్యోగ ఉపాధ్యాయుల ఆశలు తీర్చడం మాత్రమే కాదు. రాష్ట్రంలో విద్యారంగం మెరుగుపడడానికి, ప్రజల్లో ఆదరణ పెరగడానికి కూడా కారణం కాగలదని పలువురు అంచనా వేస్తున్నారు.