సింగిల్ పాయింట్ ప్రశ్న. వైసీపీకి ఎన్డీఏ కూటమి శత్రువు అవునా? కాదా? ఈ ప్రశ్నకు మామూలు పరిస్థితుల్లో అయితే వైసీపీ నేతలు చాలా ఘాటుగా జవాబు చెప్పేవారేమో గానీ.. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నోరు తెరవాలంటే సిగ్గు పడుతున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల పార్టీ కేడర్ లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ నిర్ణయం పార్టీ కొంప ముంచుతుందని పలువురు భయపడుతున్నారు. ఇది ఆత్మహత్యా సదృశం అవుతుందని అంటున్నారు. రాజ్యసభ ఎంపీ మేడా మల్లికార్జున రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారనే ఊహాగానాలు రావడమే ఇందుకు రుజువుగా భావిస్తున్నారు. మేడా.. ఒక వీడియో విడుదల చేసి ఖండించినప్పటికీ ఎవరూ దానిని నమ్మడం లేదు.
మోడీ ఎదుట సాగిలపడి ఆయన కాళ్లు మొక్కడానికి జగన్ కు పర్సనల్ అవసరాలు ఉండవచ్చు గానీ.. మనకేంటి కర్మ అని పలువురు అనుకుంటున్నారు. ఎన్డీఏ రాష్ట్రంలో తమ పార్టీని టార్గెట్ చేస్తుండగా తాము మాత్రం వారి ప్రాపకం కోసం పాకులాడడం చాలా చవకబారుగా ఉన్నదని పార్టీ నాయకులే అంటూ ఉండడాన్ని గమనించాలి.
మేడా రఘునాథ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారనే పుకార్లను కూడా పలువురు సమర్థిస్తున్నారు. ఆయన ఆత్మాభిమానం గల నాయకుడు గనుకనే సరైన నిర్ణయం తీసుకున్నారని.. పార్టీ పెద్దల బలవంతం మీద మొక్కుబడిగా ఖండించారని పలువురు అంటున్నారు. మేడా ప్రస్తుతానికి పార్టీ మార్పు వార్తలను ఖండించి నప్పటికీ.. వెళ్ళిపోతేనే పార్టీకి మేలు జరిగిందనేది వారి విశ్లేషణ. కనీసం అలా జరిగితే.. జగన్ పార్టీ ను కాపాడుకోవడానికి ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా భవిష్యత్తులో జాగ్రత్త పడతారని అంతా అంటున్నారు.