ఎన్డీయే అభ్యర్థికే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మోడీ ఎదుట సాగిలపడకుండా తాను ఉండలేనని ఆయన నిరూపించుకున్నారు. మోడీకి అసంతృప్తి కలిగించే ఏ చిన్న నిర్ణయం అయినా సరే తాను తీసుకోలేనని జగన్ చాటి చెప్పుకున్నారు. తద్వారా.. ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల.. జగన్ తన తండ్రి వైఎస్సార్ కొడుకుగా వారసుడే గానీ.. ఆయన రాజకీయ లక్ష్యాలకు భావజాలానికి వారసుడు కాదని చాటి చెప్పిన మాట నిజం అని జగన్ నిరూపిస్తున్నారు.
ఒకవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అనుకున్న ఎన్డీఏ ఆలోచనలకు గండి కొడుతూ, ఇండియా కూటమి తెలుగువాడైన జస్టిస్ సుదర్శన రెడ్డిని తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. ఇక్కడి నుంచి అసలు డ్రామా మొదలైంది.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి పెరిగింది. మరొకవైపు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని.. ఏకగ్రీవానికి సహకరించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జగన్ కు ఫోన్ చేశారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎన్డీఏ చేతిలోనే దారుణంగా ఓడిపోయి సిగ్గుతో కుంచించుకుపోయి ఉన్న నేపథ్యంలో.. మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అందరూ అనుకుంటున్నారు. ఒకవైపు జగన్ , కేంద్రంలో మోడీ అంటే భయభక్తులతో మెలగుతున్నారనే ప్రచారం బాగా ఉంది. తన మీద ఉన్న ఈడీకేసులు, సీబీఐ కేసుల్లో రక్షణ కోరుకుంటూ.. మోడీ చెప్పుచేతల్లో జగన్మోహన్ రెడ్డి మెలగుతున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నిశిత విమర్శలు చేస్తూ ఉంటుంంది. షర్మిల కూడా ఈ విషయంలో జగన్ ను ఓ ఆటాడుకుంటున్నారు.
ఆ విమర్శలకు తగ్గట్టుగానే జగన్.. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించడం ఆయన పార్టీ పరువు తీస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే.. జగన్ మద్దతు ఎన్డీయే కూటమికి అవసరం ఎంతమాత్రమూ కాదు. ఇండియా కూటమి అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గే అవకాశం లేదు. జగన్ పరువుగా ఓటింగుకు దూరం ఉంటే సరిపోయేది కదా.. ఆ మేరకు బిజెపి పెద్దలకు ఆయన సర్దిచెప్పుకుని ఉంటే బాగుండేది కదా.. అని పార్టీ వర్గాల్లోనే రుసరుసలు వినిపిస్తున్నాయి. ఈ జగన్ నిర్ణయం వలన..పార్టీకి మర్యాద పోయిందని బాధపడుతున్నారు. తద్వారా షర్మిల మరింతగా జగన్ ను తిట్టిపోయడానికి ఆస్కారం ఇచ్చినట్టు అయిందని కూడా పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.