వెనుకబడ్డ ఎమ్మెల్యేలకు స్పెషల్ క్లాస్, ఓరియెంటేషన్!

ఒక తరగతిలో వందమంది స్టూడెంట్స్ ఉన్నారని అనుకోండి. టీచరు వాళ్ళు అందరికీ ఒకే మాదిరిగా పాఠం చెబుతాడు. ఒకే మాదిరిగా హోం వర్క్ ఇస్తాడు. కానీ ఆ వందమంది ఒకే తీరుగా ఆ హోం వర్క్ పూర్తి చేయరు కదా. వందమందికి ఒకే తీరుగా మార్కులు రావడం జరగదు కదా! అలాంటప్పుడు ఆ టీచరులో వారందరి శ్రేయస్సు గురించి సమానమైన శ్రద్ధ ఉంటే.. వెనుకబడ్డ వారిని వదిలేయకుండా, వారిని కూడా అందరితో సమానంగా తయారుచేయాలని అనుకుంటే.. ఏం చేస్తాడు? వెనుకబడిన పిల్లల కోసం, స్పెషల్ క్లాసులు, ఓరియెంటేషన్ క్లాసులు పెట్టుకుంటాడు. వారికి స్పెషల్ గా తర్ఫీదు ఇచ్చి.. మిగిలిన అందరు పిల్లలతో సమానంగా పెర్ఫార్మ్ చేసేలా తీర్చిదిద్దుతారు. ఆ రకంగా ఆ స్కూల్ క్రెడిబిలిటీ పడిపోకుండా, విద్యార్థుల జీవితాలు పాడైపోకుండా చూసుకుంటాడు.

ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అచ్చంగా అదే కసరత్తు జరుగుతోంది. సుపరిపాలనలో తొలిఅడుగు పేరుతో.. పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ప్రజల వద్దకు వెళ్లాలని, వారితో మమేకం కావాలని. ప్రభుత్వ కార్యక్రమాలను వివరించి చెప్పాలని చంద్రబాబు నాయుడు ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడంలో నియోజక వర్గాల్లో వెనుకబడిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పెషల్ ఓరియెంటేషన్ క్లాసులు తీసుకుంటున్నారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ పేరుతో ప్రజల వద్దకు వెళ్లే.. వారి ఆదరణను పెంచుకోగలిగే అవకాశాన్ని సరిగ్గా నిర్వర్తించలేకపోయిన ఎమ్మెల్యేలకు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమం ప్రకటించినా సరే.. దానిమీద ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ ప్రజాభిప్రాయాలు తెలుసుకుంటూ, ఫీడ్ బ్యాక్ ను తెప్పించుకుంటూ సమీక్షిస్తుంటారని, వాటిని జాగ్రత్తగా గమనించి అవసరమైన మార్పుచేర్పులు కూడా చేస్తుంటారని అందరికీ తెలుసు. ఆ క్రమంలోనే సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కార్యక్రమం ప్రకటించాక.. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉన్నదో కూడా ఆయన ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. అయితే తొమ్మిది నియోజకవర్గాల్లో చాలా పూర్ గా ఉన్నట్టు తెలిసింది. అంటే కనీసం వారికి పాస్ మార్కులు కూడా రాలేదు.

నియోజకవర్గాల్లో 30 వే ఇళ్ల కంటె తక్కువ ఇళ్లకు వెళ్లి నాయకులను సెపరేట్ గా జాబితా తీస్తే 9 నియోజకవర్గాలు తేలాయి. వీరిని పల్లా శ్రీనివాపరావు పిలిపించారు. ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు తెచ్చే కార్యక్రమం ఇది అని, అందరూ తప్పకుండా పాటించాలని అన్నారు. ఇంటింటికీ తిరగాలని సూచించారు. యాప్ సరిగా పనిచేయకపోవడం, కొన్ని ప్రాంతాలలో నెట్ వర్క్ సరిగా లేకపోవడం వల్ల తమ పర్యటనలు సరిగ్గా రికార్డు కాక వెనుకబడినట్టు కొందరు చెప్పినట్టు తెలిసింది.

చంద్రబాబునాయుడు అటు ప్రభుత్వ పరంగా అయినా, ఇటు పార్టీ కోసం అయినా.. ఒక కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత.. దాని అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. అవసరాన్ని బట్టి ఆ పథకంలో మార్పు చేర్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండే నాయకుడు అని ప్రజలు అనుకుంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories