దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం మీద అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో రూపొందించాలనే ప్లాన్ తో రాజమౌళి ముందుకు వెళ్తున్నారు. మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తోంది. వచ్చే నెల మొదటి వారంనుంచే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని, దానికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మహేష్ బాబు పాత్రలో ఎన్నో వేరియేషన్లు చూపించనున్నారని కూడా చెబుతున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన కథాంశం విషయానికి వస్తే, రచయిత విజయేంద్రప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఆయన చెప్పినదాని ప్రకారం, తాను మరియు రాజమౌళి ఇద్దరూ దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ అభిమానులు. ఆయన నవలల నుంచే ప్రేరణ తీసుకొని ఈ సినిమాకి కథను రూపుదిద్దారట. అందువల్ల ఈ ప్రాజెక్ట్ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ముందుకు వెళ్తుందని అర్థమవుతోంది. ఈ చిత్రానికి సంగీతాన్ని కీరవాణి అందించగా, సంభాషణలను దేవా కట్టా రాస్తున్నారు.