మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డికి ఎట్టకేలకు బెయిలు లభించింది. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న కాకాణి గోవర్దన రెడ్డి క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, అక్రమ తరలింపు, అనుమతి లేకుండా చేపట్టిన పేలుళ్లు వంటి నేరాలకు సంబంధించి నిందితుడిగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఆయనకు బెయిలు విధించడంలో ఏపీ హైకోర్టు అనేక నిబంధనలు విధించింది. ఏపీ తెలంగాణ దాటి మరో ప్రాంతానికి వెళ్లడానికి కూడా వీల్లేదంటూ హుకుం జారీ చేసింది.
దర్యాప్తు అధికారికి కాకాణి గోవర్దన రెడ్డి ముందుగా తన పాస్ పోర్టును సరెండర్ చేయాల్సి ఉంటుంది. విదేశాలకు పారిపోయే అవకాశం లేకుండా కోర్టు ఈ షరతు విధించడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి హోదా గల వ్యక్తి కావడంతో.. సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండేందుకు కూడా కోర్టు కొన్ని షరతులు విధించింది. పోలీసులు చార్జిషీటు దాఖలు చేసేవరకు నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టకూడదని నిర్దేశించారు.
క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలతో పాటు, మూసివేసిన క్వార్ట్జ్ గనుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడం, ఒక ప్రాంతంలోఉన్న అనుమతులతో మరో చోట తవ్వకాలు చేయడం, నెల్లూరు జిల్లా నుంచి క్వార్ట్జ్ ఎగుమతి చేస్తున్న ఇతర వ్యాపారులు అందరినుంచి కూడా కమిషన్లు వసూలు చేయడం వంటి అనేక నేరాల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డి నిందితుడు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పోలీసులు ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో ఆయన పోలీసుల మీద చిందులు తొక్కారు. పోలీసుల బట్టలు విప్పదీయించి కొడతానంటూ రంకెలు వేశారు.
చివరికి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లే సమయానికి ఆయన నెల్లూరులోని రెండు ఇళ్లనుంచి కుటుంబంతో సహా పరారయ్యారు. ఒకవైపు ముందస్తు బెయిలు కోసం పిటిషన్లు వేయిస్తూ కాకాణి గోవర్దన రెడ్డి కొన్ని నెలలపాటు పరారీలోనే గడిపారు. ఆయనకు ముందస్తు బెయిళ్లు మాత్రం లభించలేదు. ఈలోగా పోలీసులు వలపన్ని ఆయనను అరెస్టు చేశారు. ఆ తరువాత.. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అేనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు.
మొత్తం క్వార్ట్జ్ కుంభకోణంలో నిర్వహణ పాత్ర అంతా అతనిదే అని తేల్చారు. ఈ దందా సాగించినంత కాలమూ.. నెలకు 20 కోట్ల రూపాయల వంతున.. జగన్ కు వాటాలు పంపేవారని కూడా దర్యాప్తులో తేలినట్టు వార్తలు వచ్చాయి. మొత్తానికి ఇన్నాళ్లకు కాకాణి గోవర్దన రెడ్డికి బెయిలు లభించింది. అయితే.. పోలీసులు చార్జిషీటు వేసేదాకా ఆయన నెల్లూరులో అడుగుపెట్టడానికి వీల్లేదని ఆదేశించడం కూడా కేసు దర్యాప్తు సవ్యంగా సాగడం కోసం మాత్రమే అని పలువురు భావిస్తున్నారు.