జగన్ ఆత్మీయ దళానికి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ!

మూడున్నర వేల కోట్ల రూపాయలను కాజేసిన లిక్కర్ కుంభకోణం కేసులో కీలక నిందితులు, సూత్రధారులు అయిన జగన్ ఆత్మీయులకు ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిమాండులోకి వెళ్లిన నాటినుంచి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా బెయిలు కోసం పిటిషన్లు వేస్తూనే ఉన్నప్పటికీ.. తాజాగా కూడా వారి పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. వారికి రెగ్యులర్ బెయిల్ తో పాటు, మరో ఇద్దరు నిందితుల ముందస్తు బెయిలు పిటిషన్లను కూడా కొట్టేసింది. దీంతో కొందరు మరికొన్నాళ్లు జైల్లోనే ఉండాలి. ఇద్దరు మాత్రం అరెస్టు భయంతో కాలం గడపాలి.

జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన పేషీలో ఉన్న కీలక అధికారులు ధనంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. అలాగే వైఎస్  భారతి ఆర్థిక సలహాదారు, ఆమె భారతి సిమెంట్స్ కంపెనీలో పూర్తికాల డైరక్టర్ అయిన గోవిందప్ప బాలాజీ కూడా. వారికి జతగా.. రాజకీయాల్లో జగన్ కు అత్యంత విశ్వసనీయుడైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు రాజమండ్రి జైల్లో గడుపుతున్నారు.  వీరందరూ తమకు బెయిలు కావాలంటూ వేసుకున్న పిటిషన్లపై వాదనలు వినడం పూర్తిచేసి తీర్పును సోమవారానికి రిజర్వు చేసిన ఏసీబీ కోర్టు తాజాగా ఆ పిటిషన్లను కొట్టివేసింది. వారితో పాటు.. ఏ2, ఏ3 నిందితులు అప్పటి ఏపీ బెవరరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ లు ముందస్తు బెయిలు కోసం వేసుకున్న పిటిషన్లను కూడా కొట్టి వేసింది.

మూడున్నర వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిన నిందితుల్లో 12 మంది రిమాండులో జైల్లోనే ఉన్నారు. వీరు పలు విడతలుగా బెయిలు కోసం పిటిషన్లు వేసుకుంటూనే ఉన్నారు.. రిజెక్టు అవుతూనే ఉన్నాయి.
జగన్ పేషీలో సీఎం తరఫున అన్ని వ్యవహారాలను తామే చక్కబెడుతూ వచ్చిన ఈ ఇద్దరు అధికారులు కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి.. మద్యం కుంభకోణం విషయంలో కూడా.. రాజ్ కెసిరెడ్డి నెట్వర్క్ మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన వందల కోట్ల రూపాయలను ఎప్పటికప్పుడు తమ అధికారిక వాహనాల్లోనే నగదురూపంలో తీసుకువెళ్లి అంతిమ లబ్ధిదారు అయిన బిగ్ బాస్ కు అప్పగిస్తుండేవారని సిట్ తమ విచారణలో తేల్చింది.

అలాగే.. వైఎస్ భారతి  ఆర్థిక వ్యవహారాలు అన్నీ చూస్తూ ఉండే గోవిందప్ప బాలాజీ ఈ అక్రమార్జనల నగదును ఏయే రూపాల్లోకి మళ్లించాలి, ఎలా వైట్ గా మార్చాలి.. ఎలా విదేశాల్లోకి పెట్టుబడులుగా తరలించాలి లాంటి వ్యూహరచన చేసేవారని తేల్చారు. ఆ తరువాత.. అసలు మొత్తం కుంభకోణానికి పాలసీ రూపకల్పన దగ్గరినుంచి ప్రతినెలా 5 కోట్ల రూపాయల నగదు తన వాటాగా పుచ్చుకోవడం వరకు ఎంపీ మిథున్ రెడ్డి కీలకం అని గుర్తించిన సిట్.. ఆయనను కూడా అరెస్టు చేసి రిమాండుకు పంపింది. ఈ నలుగురు అప్లయి చేసుకున్న బెయిలు పిటిషన్లు ఇప్పుడు తిరస్కరణకు గురయ్యాయి.
ఇక అధికారులు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ ముందస్తు బెయిలుకోసం వేసిన పిటిషన్లను కూడా తిరస్కరించారు. ఇప్పుడు సిట్ వారిని అరెస్టు చేసి విచారిస్తుందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories