జగన్ మోహన్ రెడ్డికి తన అహంకారాన్ని ఎవరి వద్ద ప్రదర్శించాలో ఎవరివద్ద అవసరం లేదో అనే విచక్షణ కూడా ఉన్నట్టు లేదు. తనకు రాజకీయంగా పోటీ ఉండే నాయకుల విషయంలో వారిని చులకన చేయడానికి మైండ్ గేం ఆడడం వంటివి బాగానే ఉంటాయి. కానీ కాంగ్రెస్ రాష్ట్రవ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ విషయంలోనూ జగన్ తన అహంకారం చూపించారు. ‘ఎవడడ్బా వాడు.. ఏం పేరు వాడిది.. మాణిక్కం టాగూరా’ అంటూ అవమానంగా మాట్లాడారు. ఆ తరువాత.. జగన్ మోడీ ఎదుట సాగిలపడిన తీరు తెన్నుల గురించి మాణిక్కం రోజుకోతీరుగా విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. తాజాగా మాణిక్కం ఠాగూర్, జగన్మోహన్ రెడ్డికి ఒక సవాలు విసిరారు. ఆ సవాలును అచ్చంగా స్వీకరిస్తే గనుక.. జగన్మోహన్ రెడ్డికి, ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని పలువురు విశ్లేషిస్తున్నారు. ఇంతకూ మాణిక్కం ఠాగూర్, జగన్ కు ఏం సవాలు విసురుతున్నారో తెలుసా?
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ కాళ్లు మొక్కి తన భక్తిని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి.. తన పార్టీలోని వైఎస్సార్ పేరును తొలగించాలని మాణిక్కం సవాలు చరేస్తున్నారు. వైఎస్సార్ ఎన్నడూ ఏ ప్రధాన మంత్రి యొక్క కాళ్లు కూడా పట్టుకోలేదని, అలాంటి నేత పేరు పెట్టుకుని జగన్ పార్టీ నడపడం కరెక్టు కాదని ఆయన చెబుతున్నారు.
నిజానికి వైఎస్సార్ పేరును జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి ఒక తురుపుముక్కలాగా వాడుకుంటూ ఎదిగారనేది అందరికీ తెలిసిన సంగతే. ముఖ్యమంత్రిగా ఉంటూ కొన్ని విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చిన తర్వాత.. హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరనానికి గురైన వైఎస్సార్ పట్ల ప్రజలకు ఉండే సానుభూతినే పెట్టుబడిగా వాడుకుని రాజకీయంగా ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు. కానీ వైఎస్సార్ తరహా పరిపాలన శైలి మాత్రం ఆయనకు రాలేదు.
వైఎస్సార్ కూతురు షర్మిల కూడా.. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి పేరును పార్టీలో పెట్టుకున్నం మాత్రాన.. ఆయనకు రాజకీయ వారసుడు కాలేడు అని.. పలుమార్లు విమర్శించారు. తన పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ అని పిలుచుకోకుండా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే వారు వ్యవహరించుకోవాలని షర్మిల పలుమార్లు హితవు చెప్పారు. ఇప్పుడు అదే స్థాయిలో వైఎస్సార్ వారసుడిగా జగన్ క్లెయిం చేసుకునే మైలేజీని మాణిక్కం ఠాకూర్ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ ఎవరి ఎదుటా సాగిలపడలేదనే సంగతి ప్రజలకు తెలుసు. ఈ కోణంలో మాణిక్కం వాదనను వైఎస్ఆర్ అభిమానులు ఆమోదిస్తే గనుక.. వారు జగన్ ను తప్పకుండా అసహ్యించుకుంటారని పలువురు భావిస్తున్నారు. జగన్ తన పార్టీ పేరులో వైఎస్ఆర్ అనే అక్షరాలు తొలగించకపోవచ్చు.. కానీ.. ఈ తరహా ప్రచారాలు ఎక్కువైతే ప్రజలలోనే ఆయన మార్కెటింగ్ తెలివితేటల పట్ల పునరాలోచన మొదలవుతుందని పలువురు అంటున్నారు.