టీసీఎస్ సంస్థ, కాగ్నిజెంట్ సంస్థలు విశాఖలో తమ శాఖలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఒక ఎకరా 99 పైసల వంతున కేటాయించడం గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా గోల చేసిందో అందరికీ తెలుసు. ఆ రెండు సంస్థలతో కూటమి ప్రభుత్వంలోని పెద్దలు కుమ్మక్కు అయినట్టుగా.. జగన్మోహన్ రెడ్డి దళాలు ఎంతగా దుర్మార్గపు ప్రచారానికి పాల్పడ్డాయో లెక్కేలేదు. ఈ భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగిపోతున్నట్టుగా.. తాము వెనుకనుంచి నడిపిస్తూ వేర్వేరు వ్యక్తులతో కోర్టుల్లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు కూడా వేయించారు. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని, పెద్దసంస్థలు ఎలా రాగలవని ప్రశ్నించడం కూడా జరిగింది. ఒకటిరెండు సంస్థలకు భూములు ఇచ్చినందుకు తమకు అలవాటైన దురుద్దేశాలను ప్రభుత్వానికి ఆపాదించడం అలవాటు చేసుకున్న వైసీపీ దళాల నోర్లకు తాళాలు వేసే నిర్ణయం ఇది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు ఏవైనా సరే.. రాష్ట్రంలో తమ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు భూముల కేటాయింపును ఒక విధానంగా.. ప్రభుత్వం చేపట్టనుంది. దీనికి సంబంధించి.. ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి ఏపీ ల్యాండ్ అండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (ఎల్ఐఎఫ్‌టీ) పాలసీ 4.0ను ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల టీసీఎస్, కాగ్నిజెంట్ లకు భూకేటాయింపుల గురించి కోర్టులో వాదనల సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిందే కదా అని చెప్పింది. అదే సమయంలో ప్రభుత్వం పాలసీ 4.0కు తగ్గట్టుగానే ఈ భూములు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఈ పాలసీకి సంబంధించి శనివారం ఉత్తర్వులు వచ్చాయి.
దీని ప్రకారం ఫార్చూన్ 500, ఫోర్బ్స్ గ్లోబల్ 2000 తదితర జాబితాల్లో గత మూడేళ్లలో రాంకింగ్ పొందిన సంస్థలు ఐటీ, ఐటీఈఎస్, గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే వారికి రాయితీతో భూములు కేటాయిస్తారు. ఈ సంస్థలకు ఒక బిలియన్ డాలర్ల మార్కెట్ కాపిటలైజేషన్ ఉండాలనేది నిబంధన. వారు రాష్ట్రంలో ఎక్కడ తమ సంస్థలను ఏర్పాటుచేయాలనుకున్నా.. వారికి ఎకరా 99 పైసల వంతున కేటాయిస్తారు. అయితే వీళ్లు మూడేళ్లలో కనీసం 3వేల మందికి ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఎకరాకు 500 మందికి వంతున ఉద్యోగాలు ఇవ్వగలగాలి.. అని నిబంధనల్లో పేర్కొన్నారు.
ఈ అయదేళ్ల పదవీకాలంలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి చేస్తామని చాలా ధీమాగా చెబుతున్న కూటమి ప్రభుత్వం.. అందుకు అనుగుణంగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా పేరు మోసిన పెద్ద సంస్థలు ఏపీలో తమ పెట్టుబడులు పెట్టేందుకు ఈ నూతన పాలసీ చాలా మేలు చేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు. రెండు సంస్థలకు భూములు ఇస్తే దుష్ప్రచారం చేశారు. అలాంటిది.. ఏ సంస్థ ముందుకు వచ్చినా సరే.. అదే ధరకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం ఏకంగా పాలసీ రూపొందించడం పట్ల.. రాష్ట్ర యువతరానికి ఉద్యోగాలు సృష్టించాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.