ఒక మంచి పనిచేస్తున్నప్పుడు.. ఆరంభంలో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆచరణలోకి దిగితే తప్ప అర్థం కాని సమస్యలు ముసురుకొని ఇబ్బంది పెడుతుంటాయి. పని ప్రారంభించిన తర్వాత.. ఎదురయ్యే కొత్త సమస్యలను ఒక్కటొక్కటిగా చక్కదిద్దుకుంటూ వెళ్లడంలోనే ఎవరి సక్సెస్ అయినా ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక సంగతి గమనించాలి. ఏదైనా పనిచేసే వారికి మాత్రమే ఇలాంటి కష్టనష్టాలు తెలుస్తాయి. ఏ పనీ చేయకుండా కబుర్లు చెబుతూ.. అప్పులు తెచ్చిన డబ్బును ప్రజలకు తలాకొంచెం పంచేసి వినోదం చూసేవాళ్లకి, ఓటుబ్యాంకు తయారైందని మురిసిపోయే వారికి పనిచేయడంలో ఎదురయ్యే కష్టాల గురించి తెలియదు. అందుకే పనిచేసే ఇతరుల మీద వాళ్లు రాళ్లు విసురుతూనే ఉంటారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభిస్తే.. ఆరంభంలో ఎదురైన కొన్ని ఇబ్బందుల గురించి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు ఏదో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టుగా విషప్రచారం సాగించాయి. అయితే.. ఆచరణలో పెట్టిన దగ్గరినుంచి ఈ పథకం అమలును సమీక్షిస్తున్న 36 గంటలు కూడా గడవకముందే.. ఆ ఇబ్బందులను ప్రభుత్వం సరిచేసి.. వారి నోర్లు మూయించింది.
వివరాల్లోకి వెళితే.. ఉచిత బస్సు ప్రయాణం హామీని అమల్లో పెట్టిన తర్వాత.. ఆర్టీసీ సంస్థకు ఎదురుకాగల కొన్ని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్లలో ఉచితాన్ని అనుమతించకుండా నిబంధనలు విధించింది సర్కారు. మహిళల సాధికారత, ఉపాధుల దిశగా వారికి ఉపయోగపడే ఉద్దేశంతోనే ఉచితం పథకం తెచ్చిన నేపథ్యంలో.. ఘాట్ రోడ్లలో కూడా అనుమతిస్తే తిరుమల, శ్రీశైలం గట్రా.. తీర్థయాత్రలకు వెళ్లే వాళ్లు ఎక్కువవుతారని, ఉచిత ప్రయాణావకాశం కల్పించడం ద్వారా.. సంకల్పిస్తున్న అసలు లక్ష్యం, మహిళా సాధికారత అనేది పలచన అవుతుందని వారు భయపడ్డారు. అయితే చంద్రబాబు నాయుడు నిబంధనలు పెట్టేసి వదిలేయలేదు. తాను పెట్టిన నిబంధనలు అమలై తీరాల్సిందే అని పట్టుపట్టి కూర్చోలేదు. ఎప్పటికప్పుడు పథకాన్ని సమీక్షిస్తూనే ఉన్నారు. ఆ క్రమంలో ఏజన్సీలు, కొండప్రాంతాల్లోని గిరిజన తాండాలు, మారుమూల గ్రామాల వారికి ఈ నిబంధన వలన చాలా నష్టం జరుగుతోందని అర్థమైంది. రెండు రోజులు కూడా గడవక ముందే.. అధికారులతో సమావేశమై.. ఈ నిబంధనను సడలించాలని ఆదేశాలు ఇచ్చారు. ఘాట్ రోడ్లలో కూడా ఉచిత ప్రయాణం అనుమతించేలా ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రభుత్వం తమ నిర్ణయం అమలు తీరుతెన్నులను ఒకసారి గమనించుకుని, సమీక్షించుకుని సరిదిద్దుకునేలోగా.. జగన్ దళాలు నానా యాగీ చేసేశాయి. ఘాట్ రోడ్ల మహిళలను మోసం చేశారంటూ.. అనేక హేయమైన ప్రచారాలు ఒక్కరోజులోనే హోరెత్తించారు. ప్రభుత్వాన్ని కార్నర్ చేయగలమని అనుకున్నారు. అయితే ప్రభుత్వం నిబందన సడలించడంతో.. సాక్షి మరియు జగన్ దళాలు తప్పుడు ప్రచారాలు తుస్పుమన్నాయి. పేద మహిళలకోసం పాటుపడుతున్నట్టుగా దొంగ ఏడుపులు ఏడవడానికి వారికి అవకాశమే లేకుండాపోయింది. సందు దొరికితే చాలు కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నించడమూ, వారి ప్రయత్నాలు నీరుగారిపోవడమూ జరుగుతూనే ఉంది.