తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా వచ్చిన తాజా చిత్రం కూలీ బాక్సాఫీస్ దగ్గర మంచి హడావుడి చేస్తోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కథనం విషయంలో అంతగా బలంగా లేకపోయిందని సినీ ప్రేమికులు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు విమర్శకులు కూడా లోకేష్ కెరీర్లో రైటింగ్ పరంగా ఇది కొంచెం బలహీనంగా అనిపిస్తోందని అభిప్రాయపడ్డారు.
ఇక ఈ ఫీడ్‌బ్యాక్‌తో ఇప్పుడు టాలీవుడ్ హీరోలు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తోంది. గతంలో రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లాంటి హీరోలు లోకేష్‌తో సినిమా చేయాలనే ఆసక్తి చూపించారు. కానీ కూలీకి వచ్చిన రిస్పాన్స్ చూసిన తర్వాత ప్రస్తుతం ఆయనతో ప్రాజెక్ట్స్ చేయడంపై వారు అంతగా ముందుకు రాలేదని తెలుస్తోంది.
అంతలోనే లోకేష్ తన తదుపరి చిత్రాన్ని ప్లాన్ చేస్తూ తమిళ హీరో కార్తీతో ఖైదీ 2 తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక భవిష్యత్తులో ఆయన తెలుగు హీరోలతో కలిసి సినిమా చేస్తాడా లేదా అన్నది మాత్రం సమయం చెప్పాలి.