వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి ఎంపీ గురుమూర్తి తెలిసి చేశారో తెలియక చేశారో క్లారిటీ లేదు గానీ.. మొత్తానికి జగన్ పరువును బజార్లో పెట్టారు! జగన్ దురహంకారం గురించి, నాటకీయత గురించి, అవకాశవాదం గురించి.. ప్రజలందరూ కూడా బాహాటంగా చర్చించుకునే పరిస్థితిని కల్పించారు. జగన్మోహన్ రెడ్డి తనకు అవసరం ఉన్న వారిపట్ల ఎంతటి భక్తి ప్రేమలనైనా నటిస్తూ ఉంటాడని.. గురుమూర్తి లేవనెత్తిన వివాదం వల్ల ప్రపంచానికి ఇప్పుడు అర్థం అవుతోంది. అది ఎలాగో తెలుసుకోవాలంటే వివరాలు అన్నీ చూడాల్సిందే.
పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో ఓడిపోతున్నామని అర్థమైన వెంటనే.. ఫలితాలకు ముందు రోజే ప్రెస్ మీట్ పెట్టి తాను తలచిన బురద చల్లేసి పలాయనం చితగించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన అంతటితో ఊరుకుని ఉంటే ఎంతో మర్యాదగా ఉండేది. కానీ రెచ్చిపోయి, రాహుల్ గాంధీని విమర్శించడం- రాహుల్, చంద్రబాబుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడని వెటకారపు వ్యాఖ్యలు చేయడం.. ‘వాడెవడో వాడెవడబ్బా వాడి పేరేంటి మాణిక్యం టాకురా’ అంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని చులకనగా మాట్లాడడం.. ఇలాంటి పనుల ద్వారా జగన్ కొరివితో తన తల గోక్కున్నట్లుగా అయింది.
జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మాణిక్యం ఠాగూర్, షర్మిల సహా కాంగ్రెస్ పార్టీ ఇతర నేతలు.. మోడీ సేవలో జగన్ తరించే వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. మోడీ కాళ్లకు జగన్ మొక్కుతున్న దృశ్యాలను ట్యాగ్ చేసి జగన్ మోడీ భక్తిని, తన కేసుల నుంచి రక్షణ కోసం చూపించే అవకాశవాద వైఖరిని మాణిక్యం ఠాగూర్ ఎండగట్టారు.
ఇక్కడితో వదిలేసి ఉంటే అంతా చల్లబడిపోయేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గురుమూర్తి వ్యవహారాన్ని మళ్లీ కెలికారు. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చారు. ఎలాగంటే ‘పెద్దలపట్ల జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించే భక్తి ప్రవర్తనకు అది నిదర్శనమే తప్ప.. మోడీ ఎదుట సాగిలపడినట్లు కాదు’ అంటూ మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ కు కౌంటర్ ఇచ్చారు ఎంపీ గురుమూర్తి.
మాణిక్యం ఠాగూర్ విడిచిపెట్టలేదు. పెద్దలపట్ల జగన్ కపట గౌరవాన్ని ఇంకా నిశితంగా విమర్శించదలచుకున్నారు. ‘జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా తన తల్లి పాదాలకు నమస్కరించిన దృశ్యం ఏదైనా ఉందా’ అంటూ చాలా షార్ప్ ప్రశ్నలు సంధించారు. జగన్ రోడ్డు మీద తనను కౌగిలించుకోవడానికి వచ్చే మహిళలకు ముద్దులు పెట్టిన తరహాలోనే కన్నతల్లికి కూడా కృతకమైన, ఎలాంటి స్పందన లేని ముద్దులు పెడతారే తప్ప ఆమె పట్ల నిజమైన ప్రేమను కనబరిచిన దాఖలాలే మనకు కనిపించవు. అలాంటిది జగన్ తన తల్లి పాదాలకు నమస్కరించడం అనూహ్యమైన సంగతి.
ఇప్పుడు పరిస్థితులను గమనిస్తే తల్లి మీద తనకు ప్రేమ తగ్గిపోయిందని, ఆమెకు తాను గతంలో గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిన కంపెనీ షేర్లను తిరిగివ్వాలని కోరుతూ ట్రిబ్యునల్ లో కేసు వేసి సాధించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి! ఇక భవిష్యత్తులో ఆమెకు మామూలు నమస్కారమైనా చేస్తాడనే సూచన కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ కపట ప్రేమలను కపట భక్తి లను ప్రజలకు తెలియజేసేలాగా మాణిక్యం ఠాగూర్ ప్రశ్నలు ఉన్నాయి. ఎంపీ గురుమూర్తి ఆయనను కెలక్కుండా ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేదే కాదు కదా అని సొంత పార్టీ వారే పెదవి విరుస్తున్నారు.