అంత సీనుందా: రాజీనామాలతో సవాలు విసరనున్న జగన్!

పులివెందుల రూరల్ మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కకపోవడం అనేది ఎంతో కీలకమైన  సంగతి. ఇది కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి పరువుకు సంబంధించిన సమస్య మాత్రమే కాదు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పరువుకు కూడా సంబంధించిన సమస్య. ఎందుకంటే.. వైఎస్ఆర్ కాలంనుంచి కూడా ఈ మండలంలో జడ్పీటీసీ ఎన్నికలు జరగనేలేదు. ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారు.. ఆతర్వాత స్థానిక ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయి. అదే రివాజుగా సాగింది. తొలిసారి ఎన్నిక జరిగితే.. డిపాజిట్ గల్లంతైంది. దీని సంకేతాలు చాలా బలమైనవి.

ఎందుకంటే.. ఇన్ని దశాబ్దాలుగా తండ్రీ కొడుకులు.. మండలంలోని ప్రజల మనోభిప్రాయాల్ని తొక్కిపడుతూ.. దుర్మార్గపు పెత్తనం సాగించారా? అనే సందేహాలు పుట్టే పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో.. జరిగిన ఎన్నిక ఒక బూటకం అని సాధికారికంగా నిరూపించే అవకాశం ఏమిటి?  పరువు కాపాడుకునే మార్గం ఏమిటి? అనే కసరత్తులో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకు ఆయనకు స్ఫురించిన బ్రహ్మాస్త్రం ఎమ్మెల్యేగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే అని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

పులివెందులలో జగన్ ప్రజాదరణ క్రమక్రమంగా సన్నగిల్లుతూ ఉన్నదని ఎమ్మెల్యే ఎన్కికల ఫలితాలను గమనిస్తేనే అర్థమవుతుంది. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మెజారిటీ 40వేలు మాత్రమే. ఆయన అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాక.. ప్రజాదరణ పెరిగింది. మెజారిటీ 68 వేలు అయింది. ఆయన మరణానంతరం ఒకసారి ఏకగ్రీవంగా గెలిచిన విజయమ్మ, ఆ తర్వాత ఉప ఎన్నికలో తలపడితే ఆమెకు 81వేల మెజారిటీ దక్కింది. 2014లో ఇక్కడ పోటీచేసిన జగన్ కు 75 వేల ఓట్లు మెజారిటీ వచ్చింది. 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటుచేసే సమయానికి ఆయన దక్కించుకున్న మెజారిటీ ఏకంగా 90 వేలు. సాధారణంగా అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడికి సొంత నియోజకవర్గంలో పట్టు మరింతగా పెరగాలి. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి మెజారిటీ 60 వేలకు పడిపోయింది. ముఖ్యమంత్రిగా ఆయన అయిదేళ్ల పాలనను సొంత నియోజకవర్గంలోనే ప్రజలు ఆదరించలేదని దీంతో తేలింది. ఏడాది తర్వాత చూస్తే పులివెందుల రూరల్ మండలంలో పదిన్నర వేలకు గాను కేవలం 653 మాత్రమే దక్కాయి. దీంతో ఆయన ప్రాభవం మటాష్ అయినట్టే అని అంతా అనుకుంటున్నారు.

ఈ నష్టనివారణ ఎలా? అనే భయంతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఆయనకు కనిపిస్తున్న ఒకే మార్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఉపఎన్నికకు వెళ్లాలి. 2024లో వచ్చిన 61687 ఓట్ల మెజారిటీ కంటె కాస్త ఎక్కువ ఓట్లు మెజారిటీ తెచ్చుకుని తనకు సొంత అడ్డాలో తిరుగులేదని చాటుకోవాలని అనుకుంటున్నట్టు గుసగుసలున్నాయి. ఆ పనిచేయకపోతే పరువు పోతుందని భయపడుతున్నారు. అదే సమయంలో ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికల్లో గనుక మెజారిటీ తగ్గిందంటే.. ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని కూడా పార్టీలోని సీనియర్లు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయినా జగన్ మాత్రం పరువుకోసం రాజీనామా- ఉపఎన్నికకు వెళ్లాలనుకుంటున్నట్టుగా భోగట్టా. మరి ఆయన ఎప్పటికి సాహసిస్తారో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories