సెప్టెంబరు 17 లేదా 18వ తేదీల్లో ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభించబోతున్నట్టుగా స్పీకరు అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలకు ఒక ప్రాధాన్యత ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఇప్పటిదాకా అసెంబ్లీకి హాజరు కాకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటకాలు ఆడుతూ వస్తున్నారు. ఇలాగే గైర్హాజరు అవుతోంటే.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారి శాసనసభ్యత్వం కూడా రద్దవుతుందనే మాట కూడా సాక్షాత్తూ స్పీకరు, డిప్యూటీ స్పీకరు నోటినుంచే వచ్చింది కూడా. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి, ఆయన అనుచర ఎమ్మెల్యేలు.. తమ పదవి మంటగలిసిపోతుందనే భయంతో శాసనసభకు హాజరయ్యే అవకాశం ఉందని.. అదే జరిగితే.. వర్షాకాల సమావేశాలు హాట్ హాట్ గా మారే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు. జగన్ దళం అసెంబ్లీకి రావొచ్చు- అనడానికి కొన్ని సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని పలువురు అంటున్నారు.
చంద్రబాబునాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. చాలా వ్యూహాత్మకమైన, పరిణతి గల రాజకీయం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు అమితంగా ద్వేషించరే తెలుగుదేశం సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడును స్పీకరుగాను, అప్పట్లో వైసీపీలో ఉన్న రఘురామక్రిష్ణ రాజును డిప్యూటీ స్పీకరుగాను చేశారు. జగన్ సీఎంగా ఉండగా.. ఆయన పరిపాలనలోని లోపాలను తీవ్రమైన భాషలో ఎత్తిచూపుతూ ఆయనకు కంంటిమీద కునుకులేకుండా చేసిన నాయకులు వీరు.
అయ్యన్నపాత్రుడును అరెస్టు చేయించి.. దారుణంగా హింసించి కక్ష తీర్చుకోవడానికి జగన్ తన అయిదేళ్ల కాలంలో ఎంత గట్టిగా ప్రయత్నించారో లెక్కేలేదు. అయితే.. న్యాయపరమైన రక్షణ గురించి, చట్టాల గురించి అవగాహన ఉన్న అయ్యన్నపాత్రుడు.. తాను జగన్ మీద ఎన్ని విమర్శలు చేసినా సరే, వాటిని అడ్డు పెట్టుకుని తనను అరెస్టుచేసి హింసించకుండా కోర్టుల ద్వారా రక్షణ పొందుతూ వచ్చారు. రఘురామ విషయంలో మాత్రం జగన్ సక్సీడ్ అయ్యారు. తన పార్టీ ఎంపీగానే ఉన్న ఆయనను అరెస్టు చేయించి.. హత్యాయత్నం కూడా చేయించారు.
ఇప్పుడు సరిగ్గా ఆ ఇద్దరు నాయకులే సభాపతులుగా ఉన్నారు. వారి ఎదుట నిల్చుని, వారికి ప్రతిరోజూ నమస్కారం పెడుతూ.. వారిని అధ్యక్షా అని సంబోధించి వారు అనుమతి మేరకు నడచుకునేలాంటి పరిస్థితి జగన్ కు ఇష్టం లేకుండాపోయింది. అందుకే ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనే సాకు చూపించి.. అసలు తన పార్టీ వారిని కూడా శాసనసభకు వెళ్లనివ్వకుండా డ్రామాలాడుతున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. ఇంకొన్పాళ్లు ఇలా ఆబ్సెంట్ అయితే జగన్ దళం అందరి పదవులు ఊడుతాయి. అదే సమయంలో.. తాము ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే కనీసం సభకు వెళ్లకుండా తమ కష్టాల్ని ప్రస్తావించకుండా గడుపుతున్న వారిపై ప్రజల్లో అసహ్యం పుడుతోంది. అందుకు నిదర్శనమే.. జగన్ సొంతమండలం పులివెందులలో డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోవడం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకతను జగన్ గుర్తిస్తే గనుక.. ఆయన శాసనసభకు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రజా వ్యతిరేకత గురించి ఇప్పటికే జగన్ కు తన నిఘావర్గాల నుంచి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలు ప్రస్తావించాలని ఆయన సొంత చెల్లెలు షర్మిల కూడా సవాలు విసురుతున్నారు. మరి జగన్ ఈ విడత శాసనసభ సమావేశాలకు హాజరవుతారో లేదో, ప్రజల పట్ల తన నిబద్ధతను నిరూపించుకుంటారో లేదో వేచిచూడాలి.