చరిత్ర పుటలలోకి వెళ్లి ఒక సంఘటనను గుర్తు చేసుకోవాలి. చరిత్ర అనగానే మరీ సుదీర్ఘమైనదేమీ కాదు. జస్ట్ నాలుగైదేళ్ల వెనక్కు వెళ్లి అప్పటి ఉదంతాల్ని నెమరువేసుకోవడమే.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయుడు కొన్ని దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో, కుప్పం మునిసిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. ఆ విజయాన్ని ఆ పార్టీ చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంలో ఒక సంఘటన జరిగింది. బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడును ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి తనకు అలవాటయిన రీతిలో చులకనగా మాట్లాడారు. ‘మీ నాయకుడు చంద్రబాబును ఒకసారి కనపడమని చెప్పండబ్బా.. ఆయన మొహం చూడాలని ఉంది’ అంటూ వెటకారం చేశారు! అంటే కుప్పంలో ఓడిపోయిన పరాభవ భారంతో కృంగిపోయిన చంద్రబాబును చూడాలనేది తన కోరిక అని జగన్ కూడా వేళాకోళమాడారు.
ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే మాట అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జడ్పిటిసి స్థానాల ఎన్నికలు ఫలితాలు వెలువడిన రోజునే సాయంత్రం ధర్మవరంలో పార్టీ నాయకుడి ఇంట్లో పెళ్లి కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. కానీ ఆయన సొంత భజన ఛానల్లో కూడా లైవ్ టీవీ ప్రసారాలు లేవు. క్లుప్తంగా ముగించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నాయకులు వైసిపి వారిని ఉద్దేశించి వెటకారాలు ప్రారంభించారు. ‘మీ జగన్ ను ఒకసారి కనపడమని చెప్పండబ్బా.. ఆయన మొహం చూడాలని ఉంది’ అంటూ వారు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి గతంలో ప్రదర్శించిన దురహంకారానికి ప్రతిబింబంలాగా- ఇప్పుడు జగన్ సొంత మండలం జడ్పిటిసి ఎన్నికలు తెలుగుదేశం గెలిచిన తర్వాత ఆయనకు అవమానం ఎదురైందని వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో చాలా తరచుగా ఒక మాట చెబుతున్నారు. ‘మీరు ఏదైతే విత్తనం వేశారో అదే మహా వృక్షంగా పెరిగి పెద్దదవుతుంది’ అని ప్రవచనాలు చెబుతున్నారు. తెలుగుదేశం వారు దౌర్జన్యాలు చేస్తున్నారంటూ ప్రస్తావిస్తున్నారు. కానీ ఆయన గుర్తించలేకపోతున్న విషయం ఏంటంటే గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అరాచకాలను విత్తనంగా వేశారో.. ఆ ఫలితంగా ఎదిగిన మొక్కలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఆరోజు ఆయన ఎలాంటి అహంకారంతో వ్యాఖ్యలు చేశారో దానికి కౌంటర్ గానే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు హేళన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.