చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇప్పటికీ ఒకే మాట మీద ఉన్నారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధంలేదని ఆయన అంటున్నారు. ఈ మాటను ఆయన చాలా దృఢంగా చెబుతున్నారు. అందుకోసం దేవుడి మీద ప్రమాణం కూడా చేస్తున్నారు. ఒక కోణంలో గమనించినప్పుడు.. ఆయన చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రమాణాలు అన్నీ నిజమే కదా అని ఆయన మీద సానుభూతి ఉన్నవారు వాదిస్తున్నారు. చెవిరెడ్డి మాటలకు అర్థాలే వేరు అని వారు విశదీకరిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..
మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చెవికోసిన మేకలాగా అరచి మొత్తుకుంటున్నారు. ఆయనను నిందితుడిగా చేర్చడానికంటె ముందునుంచి, అనుచరుడు వెంకటేష్ నాయుడుతో కలిసి కొలంబో పారిపోయే ప్రయత్నంలో ఉండగా బెంగుళూరులో అరెస్టు చేయడానికంటె ముందునుంచి ఆయన చెబుతున్నది ఒక్కటే మాట! తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని అంటున్నారు.
అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే.. ఆయన మాటలు ఒకరకంగా నిజమే అనేది సానుభూతిపరుల వివరణ. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వ్యక్తులు ఈ కుంభకోణంగురించి చెబుతున్న మాటలు వేరు. వారు ఈ కుంభకోణంలో అసలు సూత్రధారులు.. పాత్రధారులపై పెత్తనం చేస్తూ ముడుపుల సొమ్మును మూటలు కట్టుకున్న వాళ్లు. వాళ్లు చెప్పిన మాటలు వేరు. ‘అసలు మద్యం స్కామ్ అనేది జరగనే లేదు. అలాంటిది లేనేలేదు. లేని స్కామ్ గురించి కేవలం మాటలు చెప్పి.. చంద్రబాబునాయుడు దొంగ కేసులు పెట్టి మమ్మల్ని రాజకీయంగా వేధిస్తున్నారు. మద్యం వ్యాపారంలో అసలు స్కామ్ కు పాల్పడింది చంద్రబాబే’ అని వారు అంటున్నారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి లాంటి కీలకనిందితులు. స్కామ్ జరగలేదని అనడం లేదు. స్కామ్ విషయంలో తనకు తప్ప మిగిలిన వారందరికీ భాగం ఉందని వారు చెబుతున్నారు.
ఇప్పుడు చెవిరెడ్డి విషయానికి వస్తే.. ఆయనకూడా.. స్కామ్ జరగలేదని గానీ, జగన్ లాగా స్కామ్ అనేదే లేదని గానీ అనడం లేదు. ‘తనకు స్కామ్ తో సంబంధం లేదని’ మాత్రమే అంటున్నారు. దేవుడి మీద ప్రమాణం చేసేంత ధైర్యంగా ఆయన సమర్థించుకునే తీరు ఏంటంటే.. స్కామ్ అంటే ముడుపులు వసూలు చేయడమూ, డిస్టిలరీలను బెదిరించి దందా చేయడమూ మాత్రమే కదా. ఆ పార్ట్ పనితో ఆయనకు సంబంధం ఉండకపోవచ్చు. రాజ్ కెసిరెడ్డి ముఠా డిస్టిలరీలనుంచి వసూలు చేసిన మూడున్నర వేల కోట్ల రూపాయలలో, బంగారం రూపంలో దాచినవి, హవాలారూపంలో విదేశాలలో పెట్టుబడులుగా తరలించినవీ పోగా.. నగదురూపంలో దాచిన వందల కోట్ల రూపాయలను ఎన్నికల అవసరాలకు తీసుకువెళ్లి తరలించే పార్ట్ ఆఫ్ వర్క్ లో మాత్రమే చెవిరెడ్డి అండ్ కో భాగం పంచుకుని ఉండవచ్చు.
వసూళ్లు, మద్యం కుంభకోణం జరిగిన తీరుతో తనకు సంబంధం లేదు కాబట్టి.. చెవిరెడ్డి అంత గట్టిగా దేవుడి మీద ప్రమాణం చేసి మరీ.. ఆ స్కామ్ తో తనకు సంబంధం లేదని చెప్పగలుగుతుంటారని వారు వాదిస్తున్నారు. డబ్బు తరలింపుతో కూడా తనకు గానీ, తన ముఠా అనుచరులు, తనకు పరిచయమున్న వ్యక్తులకు గానీ సంబంధం లేదని చెప్పాల్సి వస్తే.. దేవుడి మీద నమ్మకం ఉంటే.. చెవిరెడ్డి బహుశా ప్రమాణం చేయకపోవచ్చునని కూడా అంటున్నారు.