రెండు చోట్ల రీపోలింగ్ : ఆ ఆరూ ప్రశాంతమే!

పులివెందుల మండలంలో అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన ఆరు చోట్ల పోలింగ్ కేంద్రాలను మార్చడం ద్వారా అధికారులు ఏ లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకున్నారో దానిని సాధించారు. ప్రశాంత ఎన్నికలు అనేది ఎన్నడూ అలవాటు లేని.. ఆరుపోలింగ్ కేంద్రాల పరిధిలో తొలిసారిగా ఈ జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కాకపోతే.. నియోజకవర్గ వ్యాప్తంగా.. అల్లర్లు సృష్టించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు విపరీతంగా ప్రయత్నించినప్పటికీ.. వారి ఆటలు సాగలేదు. దరిమిలా.. కేవలం రెండే కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. పులివెందుల, ఒంటిమిట్టల్లోని తతిమ్మా 30 పోలింగ్ కేంద్రాల్లో అంతా ప్రశాంతంగానే జరిగినట్టు తేల్చారు.

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఉపఎన్నిక పోలింగ్ పూర్తయింది. పులివెందులలో 76.44 , ఒంటిమిట్టలో 82 శాతం వరకు పోలింగ్ జరిగినట్టు అధికారులు ప్రకటించారు. చెదురుమదురుగా ఘర్షణల, ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పోలింగ్ మొత్తం ప్రశాంతంగానే జరిగిందని చెప్పాలి. అయితే పోలింగ్ మొదలైనప్పటినుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నానా రభస ప్రారంభించారు. పోలింగ్ లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రారంభం నుంచే గోల ప్రారంభించారు. పలుచోట్ల నిరసనలు చేశారు.  మొత్తానికి సాయంత్రం రెండు నియోజకవర్గాల్లోనూ అక్రమాలు జరిగాయని, మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ తమ వద్ద ఉన్న ఫోటోలు, వీడియోలు సహా ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి వాదనల ఒత్తిడికి గురికాకుండా స్థానికంగా పోలింగ్ అధికారులనుంచి కూడా వచ్చిన నివేదికలు అన్నింటినీ పరిశీలించిన తర్వాత.. పులివెందుల లో రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రం రీపోలింగ్ పెట్టాలని నిర్ణయించారు.

492 ఓట్లు ఉన్న అచ్చువెల్లి  గ్రామంలోను, 1273 ఓట్లు ఉన్న కొత్తపల్లి  లోను రీపోలింగ్ జరగబోతోంది. ఇవి 3, 14 పోలింగ్ కేంద్రాలు అని అధికారులు తెలిపారు. నిజానికి అత్యంత సమస్యాత్మకంగా భావించిన 6 నుంచి 11 వరకు ఆరు పోలింగ్ కేంద్రాలను ఈసారి అధికారులు మార్చారు. అవి తమకు రిగ్గింగ్ చేసుకోవడానికి పెట్టని కోటల వంటి పోలింగ్ కేంద్రాలు కావడంతో వాటి మార్పుపై వైసీపీ నానా యాగీ చేసింది. హైకోర్టును కూడా, పోలింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆశ్రయించి భంగపడింది. ఆ ఆరు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగానే జరిగింది. కేవలం  మార్చడం వల్లనే ప్రశాంతంగా జరిగిందని లేకపోతే.. పులివెందుల ఎన్నికల వాతావరణం మరో రకంగా ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

పులివెందులలో రెండు కేంద్రాల్లో రీపోలింగుకు సంబంధించి.. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఆయా పరిధిలోని గ్రామాల్లో డప్పు ద్వారా.. రీపోలింగ్ జరుగుతుందనే విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఎన్నికలు ప్రశాంతంగా పూర్తికావడం విశేషం.

Related Posts

Comments

spot_img

Recent Stories