పులివెందుల మండలంలో చరిత్రలో మొట్టమొదటిసారిగా జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్నదని యావత్ప్రపంచమూ అనుకుంటోంది. కానీ.. పులివెందుల మండల ప్రజలు మాత్రం.. మరొక కారణానికి మురిసిపోతున్నారు. తమ జీవితంలో మొట్టమొదటిసారిగా తమ ఓటు తామే వేస్తున్నాం అని వారు మురిసిపోతున్నారు. జీవితంలో ఎప్పుడూ తమ ఓటు తామే వేసుకునే అవకాశం రానేలేదని.. తమ ఓట్లన్నింటినీ ‘పులివెందుల మా అడ్డా’ అని చెప్పుకునే నాయకులే ప్రతి ఎన్నికల్లోనూ యథేచ్ఛగా రిగ్గింగు చేసుకునే వారని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి చేదు గతం కలిగి ఉన్న తమకు.. ఈసారి జడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం.. పటిష్టమైన పోలీసు బందోబస్తు కారణంగా.. రిగ్గింగుకు సమర్థంగా అడ్డుకట్ట వేయగలిగిన కారణంగా.. తొలిసారి ఓటు వేసే చాన్స్ వచ్చిందని వారు సంతోషిస్తున్నారు.
పులివెందుల అంటేనే వైఎస్ కుటుంబానికి అడ్డా అని వైసీపీ నాయకులు చెప్పకుంటూ ఉంటారు ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి కుటుంబమే గెలుస్తూ వస్తోంది. ఆ క్రమంలో.. జడ్పీటీసీ ఎన్నిక విషయానికి వస్తే.. అసలు ఇక్కడ ఇప్పటిదాకా ఎన్నిక జరగనేలేదు. ఎమ్మెల్యేగా స్థానిక నేత్నలి ప్రభావితం చేసేస్థాయిలో వారే ఉంటారు గనుక.. ఎవరూ నామినేషన్ వేయకుండా ఒత్తిడులు చేసి ప్రతిసారీ ఏకగ్రీవంచేసుకునేవారు. 2016లో తెలుగుదేశం తరఫున రమేష్ యాదవ్ నామినేషన్ వేస్తే.. ఉపసంహరణ గడువు కూడా ముగిసన తర్వాత.. అతడిని వైసీపీలో చేర్చుకున్నారు. ప్రలోభాలతో లొంగదీసుకున్నారు. దాంతో అసలు పేరుకు పోలింగ్ జరిగింది గానీ.. తెదేపా తరఫున కించిత్తు ప్రచారం కూడా లేకపోయినందున.. వైసీపీ గెలిచింది. ఇంత ఘోరంగా జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగుదేశానికి 2600 ఓట్లు వచ్చాయి. అంటే ఆ పార్టీకి వీసమెత్తు ప్రచారం అవసరం లేకుండానే ఒక నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉన్నదని తేలిపోయింది. అదే ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీ రిగ్గింగులకు పాల్పడుతూ ఉండేవారు. ప్రజలకు ఓటు వేసుకునే చాన్సే దక్కేది కాదు.
ఈసారి కూటమి ప్రభుత్వం ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అనుకోవడంతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎలాంటి సమస్య తలెత్తకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండడంతో వారి మీద అక్కసు వెళ్లగక్కుతున్నారు.
కానీ ప్రజల్లో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 15 బూత్ ల పరిధిలో జరుగుతున్న ఉప ఎన్నిక కావడం వల్ల.. ఇంత చిన్న ఎన్నికలో కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే.. చెడ్డపేరు వస్తుందని పోలీసులు దృఢంగా ఉన్నారు. అయితే అల్లర్లు చేయడమే లక్ష్యంగా ఉన్న వైసీపీ వారి ఆటలు సాగడం లేదు. పోలీసుల దృఢవైఖరి వలన.. ప్రజలకు తమ ఓట్లు తామే వేసుకునే అవకాశం వచ్చింది. జీవితంలో ఇక్కడ మొదటిసారిగా తమ ఓట్లు తామే వేసుకుంటున్నాం అని వారు మురిసిపోతున్నారు.