ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమ చిన్న పాటి సంక్షోభంలో ఉంది. పరిశ్రమ హైదరాబాదు కేంద్రంగా నడుస్తున్న ఈ తరుణంలో.. ఇక్కడ ఆ సమస్యను పరిష్కరించుకోవడం అనేది వారికి సాధ్యం కావడం లేదు. కార్మికులకు- నిర్మాతలకు మధ్య ముదురుతున్న వివాదంలో ప్రభుత్వంలోని పెద్దలు కూడా జోక్యం చేసుకుంటున్నారు గానీ.. వారి తీరు కార్మికులకు మద్దతు పలికే విధంగా కనిపిస్తోంది. ఇలాంటి గతిలేని పరిస్థితుల్లో నిర్మాతలు కొందరు ఏపీ ప్రభుత్వం వద్దకు తరలి వెళ్లారు. అయితే ఈ సందర్భంగా వారి మాటలు మాత్రం.. అవకాశవాద ధోరణికి పరాకాష్టగా కనిపిస్తున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
తెలంగాణ నుంచి ప్రభుత్వాన్ని కలవడానికి తరలివచ్చిన నిర్మాతలతో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమావేశం అయ్యారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచి నంది అవార్డులను తిరిగి ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా దుర్గేష్ వారికి తెలిపారు. రెండు రాష్ట్రాలకు సినీ పరిశ్రమ ఒక్కటేనని, ఏపీలో స్టుడియోలు, డబ్బింగ్, రీరికార్డింగ్ థియేటర్లు నిర్మిస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తామని కూడా దుర్గేష్ వారికి హామీ ఇచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భేటీ ముగిసిన తర్వాత.. నిర్మాతల విలేకర్ల ప్రశ్నలకు స్పందించిన తీరు మరో ఎత్తు.
‘కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది గడుస్తోంది.. తెలుగు సినీరంగ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా అయినా ఇప్పటిదాకా ఇక్కడ ముఖ్యమంత్రిని కలిశారా?’ అంటూ అక్కడి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొన్నాళ్ల కిందట ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని కలిసిన నిర్మాతలతో విలేకర్లు ఈ విషయమై ప్రస్తావించారు. అయితే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ‘మా ఇండస్ట్రీ నుంచి ఒకరు డిప్యూటీ సీఎం అయ్యారు. మా సమస్యలన్నీ ఆయనకు తెలుసు. ఆయనున్నారనే ధైర్యంతోనే మేం వెంటనే రాలేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు.
గెలిచిన తర్వాత మాత్రం.. మా ఇండస్ట్రీ నుంచి డిప్యూటీ సీఎం ఉన్నారు.. అంటూ తమవాడిగా ప్రచారం చేసుకుంటున్న ఈ అవకాశవాద నిర్మాతలు.. తమ ఇండస్ట్రీ వాడు పోటీచేస్తున్నాడని.. పవన్ కల్యాణ్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లాంటిదేమైనా చేశారా? అనే ప్రశ్న ప్రజల్లో వస్తోంది. ఇప్పుడు వారే సంక్షోభంలో ఉన్నారు గనుక.. పోలోమని సీఎం అపాయింట్మెంట్ కోసం వెళ్లినప్పటికీ.. చంద్రబాబు టైం ఇవ్వలేదని తెలుస్తోంది. అందుకే మంత్రి దుర్గేష్ ను కలిశారు. ఆయన కూడా వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతానని మాత్రమే హామీ ఇచ్చి పంపారు. పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా ప్రభుత్వం ఏర్పడ్డాక కనీస మర్యాద పాటించని నిర్మాతలు ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వాన్ని ఆశ్రయించడం ఖచ్చితంగా అవకాశవాదమేనని పలువురు అంటున్నారు.