అల్లర్లు, బీభత్సం సృష్టించడమే ఇవాళ్టి ఎజెండా!

తొలినుంచి తమకు ఎదురు నిలిచే సత్తా ఉన్నవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు అని నిరూపించుకున్న చోట తొలిసారిగా ఎన్నిక జరుగుతుండడంతోనే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అహం సగం దెబ్బతినింది. అందుకే వారు ఫ్రస్ట్రేషన్ లో రగిలిపోతున్నారు. ఏకపక్షమైన ఎన్నిక అనే అవకాశమే లేకుండా.. పోటాపోటీగా పరిస్థితి మారడం.. ఓటుకు పదివేల వరకు ఇచ్చి అయినా గెలవాలని జగన్ దళాలు పట్టుదలగా అనుకోవడ అనేది.. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ను హాట్ టాపిక్ గా మార్చేశాయి. అయితే పరిస్థితి తమకు అనుకూలంగా లేకపోవడంతో.. పులివెందుల వ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం, భీతావహ పరిస్థితులు సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే పులివెందుల నియోజకవర్గంలో తెదేపా, వైసీపీ వర్గాల ఘర్షణలు జరిగాయి. ప్రతిదానినీ వైసీపీ దళాలు భూతద్దంలో చూపి యాగీ చేస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అతిని గమనించి పోలీసులు చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కడపజిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా.. ఒక్కో మండలంలో 700 మందికి పైగా పోలీసుల్ని మోహరించి.. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రెండే మండలాలలో జరుగుతున్న ఎన్నికల్లో ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా సరే.. అది పోలీసులకు పెద్ద మచ్చ అవుతుందని వారు భావిస్తున్నారు. అందుకే ఏర్పాట్ల విషయంలో ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

పులివెందులలో 15, ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంత చిన్న ఎన్నికలో ఏ చిన్న ఘటన జరిగినా పోలీసు వైఫల్యంగా తేలుతుంది. సరిగ్గా ఈ పాయింటు మీదనే వైసీపీ దళాలు ఫోకస్ పెడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక మూల పోలీసుల కళ్లు గప్పి అల్లర్లు చేసి తీరాలని వారు వ్యూహరచనల్లో ఉన్నారు. అల్లర్లు జరగాలి, బీభత్సం జరగాలి. పోలీసులు విఫలమయ్యారనే ప్రచారంతో మళ్లీ గవర్నరు వద్దకెళ్లి ఫిర్యాదు చేయాలి.. అనేదే వారి ఎజెండాగా ఉంది. పోలీసులు మాత్రం.. వైసీపీకి చెందిన పలువురు రౌడీలను, గూండాలను ఇప్పటికే హెచ్చరించారు. కొందరు నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. పులివెందులలోనే దాదాపుగా 750 మందిని బైండ్ ఓవర్ చేసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు అత్యంత ఉద్రిక్త వాతావరణం మధ్య జరగబోతున్నాయి. ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు పూర్తిచేయడం పోలీసులకు తొలిసవాలుగా ఉంది. జగన్ తమ కోటగా చెప్పుకుంటున్న చోట.. తెలుగుదేశం పాగా వేస్తుందో లేదో చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories