వైసీపీ నాయకులు చేస్తున్న కొన్ని ఆరోపణలు గమనిస్తే.. అచ్చంగా ఏడాది కిందటి వరకూ కొనసాగిన అరాచక పాలన గుర్తుకొస్తూ ఉంటుంది. వారు చేస్తున్న వ్యాఖ్యలు.. అప్పటి జగన్ పాలన గురించే, పొరబాటుగా ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారా? అనిపిస్తుంది! మరో కోణంలో చూసినప్పుడు వైసీపీ వారి దౌర్భాగ్యపు ఆరోపణలను, ఆ పార్టీ వారు కూడా అసహ్యించుకునే పరిస్థితి! ఇలాంటి నేపథ్యంలో టీడీపీ మీద విషం కక్కడమే పనిగా వ్యవహరిస్తుండే నాయకుల ఒక చర్యను గమనిస్తే.. కూటమి ప్రభుత్వానికి కితాబు ఇవ్వాలని అనిపిస్తుంది. ఎన్డీఏ కూటమి అత్యంత ప్రజాస్వామిక పాలన అందిస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది.
కడప జిల్లాలో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ రౌడీ రాజకీయం నడుస్తున్నదని వైసీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు తదితరులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిజానికి ఈ పితూరీలో కొత్త సంగతి ఏమీ లేదు.అక్కడి ఉప ఎన్నికలకు సంబంధించి కొన్ని రోజులుగా తమ మీడియా ద్వారా.. తమ స్థానిక నాయకుల ద్వారా ఎలాంటి బురద చల్లుతున్నారో.. ఎలాంటి విషం కక్కుతున్నారో అదే ఆరోపణలను పేపర్ మీద పెట్టి డీజీపీ ఆఫీసులో ఇచ్చారు. సరిగ్గా ఇక్కడే కూటమి ప్రభుత్వానికి అదనపు గౌరవం దక్కుతోంది.
ఎందుకంటే.. జగన్ పాలనలో అరాచకత్వం రాజ్యమేలింది. అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వపు వైఫల్యాలు, పోలీసుల దుర్మార్గాల మీద డీజీపీ కి ఫిర్యాదు చేయడానికి తెలుగుదేశం వారు ప్రయత్నించారు. అయితే అప్పట్లో వారిని డీజీపీ ఆఫీస్ లోకి కూడా రానివ్వలేదు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. డీజీపీ ఆఫీస్ బయట దూరంగా బారికేడ్లు ఏర్పాటు చేసి, వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చేవారిని అక్కడినుంచే తిప్పి పంపారు. అయితే అలాంటి అరాచక అప్రజాస్వామిక పాలన ఇప్పుడు లేదు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పోకడలు అందరికీ అర్థమవుతున్నాయి. వైసీపీ నాయకులు కనీసం డీజీపీ కార్యాలయానికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వగలిగారు. అందుకు వాళ్లే కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలని ప్రజలు అనుకుంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు గురివింద గింజ నీతిని అనుసరిస్తున్నారు. ఎదుటివాళ్ల మీద బురద చల్లేముందు.. వారు తమకు తాము ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వారికి ఏ ఆరోపణ చేయాలని అనిపించినా.. మా 2.0 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకింతా వడ్డీతో సహా చెల్లిస్తాం అంటూ ఎగస్ట్రాలు మాట్లాడడం కాదు. ప్రతీకార డైలాగులు వల్లించడం కాదు. ఇప్పుడు తాము ఎదుర్కొంటున్నదే ప్రతీకార పరిస్థితి అనే స్పృహ వారికి ఎందుకు కలగడంలేదో ప్రజలకు అర్థం కావడం లేదు. నిజానికి కూటమి సర్కారు ప్రతీకార పోకడలకు వెళ్లేట్లయితే.. జగన్ పాలన తరహాలోనే చేయాలని అనుకుని ఉంటే.. ఈ వైసీపీ నాయకులకు కనీసం డీజీపీ ఆఫీసులో అడుగుపెట్టే యోగ్యత కూడాదక్కేది కాదు. కానీ ఇది మంచి ప్రభుత్వం కాబట్టి.. వారి ఆటలు ఇష్టమొచ్చినట్టుగా సాగుతున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.