సత్యసాయి జిల్లాలో పాపిరెడ్డి పల్లి పరామర్శకు జగన్ వెళ్లిన సందర్భం ప్రజలకు గుర్తుండే ఉంటుంది. హెలిప్యాడ్ వద్దకు ఎవ్వరూ రావొద్దని, గ్రామంలో కార్యక్రమానికి రావొచ్చునని.. పోలీసులు కొన్ని రోజుల ముందునుంచి పదేపదే జాగ్రత్తలు చెప్పినప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఉద్యమంలాగా ఆ సూచనలు ధిక్కరించారు. వందల వేల సంఖ్యలో హెలిప్యాడ్ వద్దకు జనాన్ని పోగేసి తమ పొగరును ప్రదర్శించారు. నాయకులు తాగిస్తే తాగి, అల్లరిచేసే మూడ్ లో ఉన్న జనం ఎగబడడంలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ స్వల్పంగా దెబ్బతింది. సదరు హెలికాప్టర్ జగన్ ను ఎక్కించుకోకుండానే.. అక్కడినుంచి బెంగుళూరు వెళ్లిపోయింది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు ఏం జరిగింది? ఎందుకిలా పరిస్థితులు అదుపుతప్పాయి అనే విషయంలో పోలీసులు దృష్టి సారించారు. ఈ కేసులో ప్రస్తుతానికి పోలీసులు విచారణ పర్వం పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. కుంటిమద్దిలో జరిగిన సంఘటనల క్రమం వెనుక ఖచ్చితంగా కుట్ర దాగిఉన్నట్టుగా పోలీసుల విచారణలో తేలిందని అనుకుంటున్నారు. త్వరలో సమర్పించబోయే చార్జిషీట్ లో ఆ వివరాలు ఉండే అవకాశం ఉంది.
జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మీదికి జనం ఎగబడ్డారు. విండ్ షీల్డ్ కొంత దెబ్బతింది. వీవీఐపీని ఆ హెలికాప్టర్ లో ఎక్కించుకుని బెంగుళూరు తీసుకువెళ్లడానికి పైలట్లు నిరాకరించారు. జగన్ అప్పటికప్పుడు.. అక్కడినుంచి ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో రోడ్డు మార్గంలో బెంగుళూరు వెళ్లిపోయాడు. వ్యవహారం అక్కడితో ముగిసిపోయిఉంటే సరిపోయేది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ ఘటన నుంచి రాజకీయ మైలేజీ పిండుకోవాలని చూశారు. ఒక కొత్త వాదన తెరపైకి తెచ్చారు.
హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత ఏర్పాట్లు కల్పించడంలో ఏపీ పోలీసులు విఫలం అయ్యారంటూ నిందలు వేశారు. జగన్ ను హత్య చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. హెలికాప్టర్ చెడిపోయేలా చేసి, జగన్ ను రోడ్డు మార్గంలో ప్రయాణించే పరిస్థితిని కల్పించి, అలా రోడ్డమ్మట వెళుతుండగా చంపేయడానికి ప్లాన్ చేశారని ఆరోపించారు. నిజానికి హెలికాప్టర్ దెబ్బతినడం పూర్తిగా యాదృచ్ఛికం అయినా.. ఇలాంటి ఆరోపణలు పోలీసులు, ప్రభుత్వం మీద వచ్చేసరికి కొత్త అనుమానాలు పుట్టాయి.
పైలట్, కోపైలట్ లను తొలుత పోలీసులు విచారించారు. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సహా 85 మందిని మొత్తంగా విచారించారు. అయితే పోలీసులు, ప్రభుత్వం మీద నిందలు వేయడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఒక కుట్ర ప్రకారం.. కుంటిమద్ది హెలిప్యాడ్ వద్దకు జనాన్ని అవసరం లేకపోయినా పెద్ద సంఖ్యలో తరలించినట్టుగా, అక్కడ వారిని రెచ్చగొట్టినట్టుగా గుర్తించారు. ఈ విచారణకు హాజరు కాకుండా తోపుదుర్తి కొన్నాళ్లు పరారీలోకి వెళ్లడం కూడా అనుమానాల్ని పెంచింది. మొత్తానికి మూడునెలలకు పైగా పోలీసులు ఈ వ్యవహారంలో విచారణ జరిపారు. ప్రస్తుతానికి విచారణ పూర్తయిందని, చార్జిషీట్ రూపొందించి, వారంలోగా కోర్టులో సమర్పిస్తారని తెలుస్తోంది. వైసీపీ నాయకుల్లో అసలు ఎవరు కుట్ర పన్నారు.. ఎలాంటి కుట్ర పన్నారు అనేది అప్పటికి తేలుతుంది.