కాయ్ రాజా కాయ్.. తెదేపాలో బెట్టింగుల మహోత్సాహం!

రాష్ట్రంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా సరే.. ప్రచార పర్వం ముగిసిన పిమ్మట.. మరో రెండు వ్యవహారాలు ఫాలో అవుతాయి. ప్రచారపర్వం ముగిసిన రాత్రి నుంచి కూడా వివిధ పార్టీల నాయకులు ఓట్ల కోసం ప్రజలకు  డబ్బు పంచిపెట్టడం షురూ చేస్తారు. అదే సమయంలో ఎవరు గెలుస్తారు అనే అంశం మీద ప్రధాన అభ్యర్థుల అభిమానులు పందాలు కాయడం ప్రారంభిస్తారు. తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఆయా పార్టీల కార్యకర్తలకు ఉంటుంది. దాంతో డబ్బు పణంగా పెట్టి బెట్టింగులు కాయడం అనివార్యమైన ప్రక్రియ అవుతుంది.

ఇప్పుడు కడప జిల్లాలో రెండు జెడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండగా అక్కడ కూడా అప్పుడే బెట్టింగుల పర్వం మొదలైంది. తెలుగుదేశం పార్టీ పులివెందుల జడ్పిటిసి ఎన్నికలలో చరిత్రలో మొదటిసారిగా పోటీ చేస్తున్నది. ఆ పార్టీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతా రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి సొంత మండలం కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. ఇలాంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గ జడ్పిటిసి స్థానం కోసం ఇరు పార్టీలు హోరాహోరీ తలపడుతున్నాయి. విజయం ఎవరిని వరిస్తుందో అంత తేలికగా అంచనా వేయడం సాధ్యం కాని పరిస్థితి. ఒకవేళ ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉంటుందనే అభిప్రాయం అందరిలో వ్యాపించి ఉంటే గనుక.. బెట్టింగులకు ఆస్కారం ఉండేది కాదు. ఎన్నిక పోటాపోటీగా జరుగుతుండడంతో బెట్టింగులు కూడా అదే స్థాయిలో నడుస్తున్నాయి.

ఈ విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత ఎక్కువ ఆత్మ విశ్వాసంతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వెయ్యికి రెండువేలవంతున ఇస్తామంటూ వారు బెట్టింగులకు దిగుతున్నట్లుగా స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 1000 రూపాయలు పందెం కడితే.. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ వెయ్యిని వారు కోల్పోతారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కనుక తాము ఓడినందుకు, తెలుగుదేశం వాళ్ళు వెయ్యికి రెండు వేల వంతున వారికి చెల్లిస్తారు. బెట్టింగుల పరంగా ఇది గట్టి బేరమే.

పులివెందుల తమకు కంచుకోట అని, తమ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని వెర్రవీగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ధైర్యం ఉంటే బెట్టింగులు కాసుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులు బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చగొడుతున్నారు. మరో మూడు రోజుల్లో తేలనున్న ఫలితంలో ఎన్ని లక్షలు లేదా కోట్ల రూపాయలు ఈ బెట్టింగుల రూపంలో చేతులు మారుతాయో వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories