కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడచిపోయాయి. కానీ.. రాష్ట్రంలో ఇంకా వందల కొద్దీ నామినేటెడ్ పోస్టులు ఇంకా భర్త కాలేదు. పార్టీ అధికారంలోకి రాగానే.. తమకు ఏదో ఒక పదవులు దక్కుతాయని, కాస్త హోదా వస్తుందని, ప్రజాజీవితంలో మరింత చురుగ్గా ఉండడానికి బాగుంటుందని ఎదురుచూస్తూ వచ్చిన కార్యకర్తలకు నిరాశ తప్పడం లేదు. జులై నెలాఖరులోగా అన్ని రకాల నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తిచేసేస్తాం అని చంద్రబాబునాయుడు గతంలో ప్రకటించారు. ఆ మేరకు సంబంధిత పార్టీ సీనియర్లకు ఎంపిక కసరత్తు అప్పగించినట్టు కూడా చెప్పారు. అయితే ఆగస్టు నెలకూడా రెండు వారాలు గడచిపోతున్నాయి. ఇంకా నియామకాలు మాత్రం పూర్తి కాలేదు. పార్టీలో ఇప్పట్లో నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతుందనే సంకేతాలు కూడా రావడం లేదు. దీంతో.. అసలే నిరాశలో ఉన్న పార్టీ నాయకులు.. ఇంకెంత కాలం ఈ నిరీక్షణపర్వం కొనసాగుతుందో కదా.. అని బాధపడుతున్నారు.
నామినేటెడ్ పోస్టుల్లో ప్రధానంగా ఆలయాలు, మార్కెట్ కమిటీలు వంటివి ఉంటాయి. ప్రభుత్వం ఇటీవలే ఆలయ మార్కెట్ కమిటీలను భర్తీ చేసింది. అయితే దాదాపు వందకు పైగా ఆలయాల పాలకమండళ్ల భర్తీ గురించి ఇప్పటిదాకా పట్టించుకోనేలేదు. టీటీడీకి బోర్డు నియామకం జరిగిందే తప్ప.. ఆ తర్వాత ప్రాధాన్యంతో ఉండే అనేక ఇతర ఆలయాలకు కూడా బోర్డుల ఏర్పాటు జరగలేదు. ఆశావహుల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉంటోంది. ఆలయ పాలకమండలులు రెండేళ్ల కాలానికి మాత్రమే ఉంటాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే భర్తీ చేసి ఉంటే అయిదేళ్లు ముగిసేలోగా కనీసం ముగ్గురు బాధ్యతల్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే 14 నెలలు గడచిపోవడం వలన.. రెండు పాలకమండలులకు కూడా పూర్తి కాలం అవకాశం దక్కే పరిస్థితి లేకుండాపోయిందని కార్యకర్తల ఆవేదన.
విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. జనసేన, భారతీయ జనతా పార్టీల నుంచి అన్ని రకాల నామినేటెడ్ పోస్టులకు వారి వారి ప్రతిపాదనలను ఆల్రెడీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగుదేశంలోనే జాప్యం జరుగుతోంది. చాలా కీలక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి.. ఎమ్మెల్యేలు తమ ప్రతిపాదనలు ఇంకా ఇవ్వలేదని చంద్రబాబునాయుడు రెండు నెలల కిందట కూడా ఒకసారి అన్నారు. కానీ.. ఇప్పటికే అదే పరిస్థితి ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నామినేటెడ్ పదవులు భర్తీ అయితే నియోజకవర్గాల్లో తమకు పోటీగా మరొక అధికార కేంద్రం తయారవుతుందనే భయంతో ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు ఇవ్వడం లేదనే వాదన ఒకటి ఉంది. అదే సమయంలో.. వీరు ప్రతిపాదనలు ఇచ్చే పేర్లను యథాతథంగా పరిగణనలోకి తీసుకోకుండా.. ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయం సేకరించి.. అప్పుడే అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇది తమకు నచ్చక ఎమ్మెల్యేలు కొందరు అసలు ప్రతిపాదనలే ఇవ్వకుండా జాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ.. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా.. పదవులు దక్కుతాయని ఆశిస్తున్న వారికి మాత్రం కోరిక తీరడం లేదు.