బెయిలు దోషులు.. విచ్చలవిడి దందాలు, దౌర్జన్యాలు

‘ఆడే నోరూ.. తిరిగే కాలూ.. ఊరకుండవని’ సామెత. ఈ సంగతి ఏమో గానీ.. దౌర్జన్యాలకు, బెదిరింపులకు, దందాలకు, నేరాలకు  అలవాటు పడిన వారు మాత్రం.. ఎప్పటికీ ఆ వైఖరి మార్చుకోలేరు. ఒకసారి అరెస్టు అయినా సరే వారిలో అంత సులువుగా పరివర్తన రాదు. అరెస్టు అయి.. కేసులో ఇంకా శిక్ష తేలకుండా.. మధ్యలో బెయిలుపై బయటకు వచ్చిన సమయాల్లో కూడా.. తాము జాగ్రత్తగా ఉండాలనే స్పృహవారికి కలగదు. అలవాటైన దౌర్జన్యాలు, బెదిరింపుల పర్వాన్నే కొనసాగిస్తూ ఉంటారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులుగా  అరెస్టు అయి.. ప్రస్తుతం బెయిలుపై బాహ్యప్రపంచంలో ఉన్న వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర రెడ్డి లు కూడా  ఈ కోవకే చెందుతారు. ఒక కేసులో ఆల్రెడీ బెయిలుపై ఉన్నాం అనే వాస్తవం వారిని భయపెడుతున్నట్టుగా లేదు. ఇప్పుడు కూడా విచ్చలవిడిగా బెదిరింపులకు దిగుతున్నారు. ఆమేరకు వారి మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి. ఒకవైపు వారి బెయిలు రద్దు గురించి సుప్రీం కోర్టులో పిటిషన్లు నడుస్తుండగానే.. వారు తమ పరిధిలో బెదిరింపులతో చెలరేగడం గమనిస్తే.. వారి దుర్మార్గమైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది.

కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు పార్టీ మారి తెలుగుదేశంలో చేరాడు. నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని నిర్వహిస్తున్న తీరు తెన్నులు, ప్రతి ఒక్కరూ కూడా భవిష్యత్తు మీద నమ్మకం కోల్పోయి పార్టీని వదలిపోతున్న వైనం గమనిస్తున్న వారికి భయంపుడుతోంది. రాజకీయంగా భవిష్యత్తు కోరుకునే వారు.. వైసీపీని రాష్ట్రవ్యాప్తంగా వీడిపోతున్నారు. అయితే.. జగన్ సొంత జిల్లా కడపలో కూడా.. పులివెందుల మండలానికి చెందిన విశ్వనాథ రెడ్డి.. తెలుగుదేశంలో చేరిపోవడంతో వారికి తలకొట్టేసినట్టు అవమానం అయింది. ఒకవైపు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ పార్టీ మార్పు ఎంతో కొంత ప్రభావం చూపుతుందని వారు భయపడ్డారు. అందుకు బుజ్జగించే ప్రయత్నాలు చేసుకోకుండా.. విశ్వనాథరెడ్డిని వారు తీవ్రస్థాయిలో బెదిరించారు.

ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి (వీరిద్దరూ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక నిందితులు), అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి, ఇంకా గంగాధర్ రెడ్డి తదితరులు తనను తీవ్రంగా బెదిరించినట్టు విశ్వనాథ రెడ్డి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్ రికార్డింగులను కూడా పోలీసులకు సాక్ష్యాలుగా సమర్పించాడు. కేసులు నమోదు చేసిన పోలీసులు.. బెయిలుపై ఉన్న నిందితులు భాస్కర రెడ్డి, శివశంకర్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నందున అక్కడకు వెళ్లి వారికి నోటీసులు ఇచ్చారు.

వారి బెయిలు రద్దు వ్యవహారం సుప్రీంలో విచారణ సాగుతుండగానే.. వారు ఇక్కడ బెదిరింపులకు దిగుతుండడం చిత్రమైన సంగతి. ఈ బెదిరింపులకు పాల్పడినట్టుగా తేలిందంటే.. వారి బెయిలు రద్దయ్యే అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు. బెదిరింపులకు అలవాటు పడిన ప్రాణాలు.. బెయిలుపై బయట ఉన్నప్పుడు కూడా.. ఊరుకోవడం లేదని జనం అసహ్యించుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories