వైఎస్ వివేకానందరెడ్డి ఆరేళ్ల కిందట హత్యకు గురయ్యారు. ఇప్పటిదాకా ఆయన హత్య కేసుకు అతీగతీ లేదు. తన తండ్రిని చంపిన వారికి చట్టబద్ధమైన శిక్ష పడాలంటూ ఆయన కుమార్తె సునీత న్యాయపోరాటం చేస్తున్నారు. Justice deleyed is Justice denied అనే సూత్రం ఆమె విషయంలో జోక్ గా మారుతోంది. ఆమె పోరాటానికి ఫలితం దక్కడం లేదు. ఇలాంటి సందర్భంలో వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లిన సునీత చెబుతున్న మాటలు.. విన్నవారిని కదిలించేలా ఉన్నాయి. ఆమె వాదనలో న్యాయం ఉన్నది కదా.. అని అంతా సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
తన తండ్రిని హత్య చేసిన నిందితులందరూ బెయిలు తీసుకుని యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని, తాను మాత్రం నిత్యం భయడుతూ ఆవేదనతో గడుపుతున్నానని ఆమె అంటున్నారు. తాను తన స్వస్థలానికి రావాలన్నా కూడా భయపడాల్సి వస్తోందని ఆమె చెబుతున్నారు. న్యాయ స్థానంలో ప్రతి వాయిదాకు నిందితులతో పాటు తాను కూడా హాజరు కావాల్సి వస్తోందని, ఈ వైనం గమనిస్తోంటే.. అసలు శిక్ష నిందితులకు పడిందా? తనకే శిక్ష పడిందా? అనే అనుమానం కలుగుతోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయపోరాటం చేయాలి.. అంటూ ఆమె వ్యక్తంచేస్తున్న ఆందోళన వ్యవస్థల పనితీరును నిలదీసేలా ఉంది.
అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కోసం సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి పోరాడుతుండగా.. ఆ విచారణలో సీబీఐ ఈ కేసులో దర్యాప్తు పూర్తయిపోయినట్టుగా కోర్టుకు నివేదించడాన్ని కూడా సునీ తప్పుపడుతున్నారు. దర్యాప్తు అసంపూర్తిగా ఉన్నదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా ఆమె చెబుతున్నారు. తన తండ్రి హత్యకు గురైన రోజున ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసులను బెదిరించి.. సాక్ష్యాధారాలు అన్నింటినీ తుడిపేయించిన వైనాన్ని కూడా ఆమె గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు పులివెందులలో జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మళ్లీ బెదిరింపులకు దిగుతున్నారని ఆమె వాపోతున్నారు.
తన తండ్రి మరణించినప్పుడు శవయాత్ర నిర్వహించడానికి కూడా జగన్ అడ్డుపడ్డ విషయం ఆమె ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. శవయాత్ర వద్దని జగన్ తనను అడ్డుకున్నట్టు ఆమె గుర్తు చేస్తున్నారు. అంతక్రియలకు కూడా ఎవరూ రాకముందే ఆ పని పూర్తి చేయించడానికి జగన్ తొందరపడినట్టుగా సునీత బయటపెడుతున్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి పనిచేసే వాతావరణం కల్పిస్తే.. హత్యా రాజకీయాలు చేసే వారికి గుణపాఠం అవుతుందని సునీత అంటుండడం.. తండ్రిని కోల్పోయిన ఆమె ఆవేదనకు అద్దం పడుతోంది.