నోట్ల కట్టలను దొంతర్లుగా పేర్చి వాటి పక్కన నిల్చుని ఎంచుతూ పోజులు కొట్టడం, చార్టర్డ్ విమానాల్లో విలావసవంతమైన విదేశీ పర్యటనలు ఇలాంటి వ్యవహారాలన్నీ వీడియోల సహా వెలుగులోకి వచ్చాయి. ఎవడైతే.. లిక్కర్ కుంభకోణంలో దందాలు చేసి వసూలు చేసిన మూడున్నర వేల కోట్ల రూపాయల్లో.. ఎన్నికల కోసం కేటాయించిన మొత్తాలను తరలించిన వ్యక్తిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో.. అదే వెంకటేష్ నాయుడే ఈ వీడియోలలో ప్రధాన పాత్రధారి. లిక్కర్ కుంభకోణం సొమ్ములను ఎక్కడికక్కడ ఎన్నికల అవసరాలకు చేరవేయడానికి కీలక భూమిక పోషించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన వెంకటేష్ నాయుడు ఇప్పుడు రిమాండులో ఉన్నారు. ఆయన మొబైల్ ఫోను నుంచి పోలీసులు ఇప్పటికే అనేక కీలక ఆధారాలు రాబట్టారు. ఇంకా ఆయన ఫోనులో ఎన్ని రకాల ఆధారాలు, రహస్యాలు దాగి ఉన్నాయో గానీ.. అందులోని సమాచారం బయటకు లీక్ కాకుండా చూడాలంటూ.. ఆయన భార్య హైకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలు చేయడం చిత్రంగా ఉంది.
‘తన భర్త విషయంలో మీడియాలో ప్రసారం చేసిన, ప్రచురించిన వ్యాప్తి చేసిన సమాచారాన్ని తొలగించాలని.. ఇక మీదట ప్రసారం ప్రచురణ వ్యాప్తి చేయకుండా నియంత్రించాలని కోరుతూ వెంకటేష్ నాయుడు భార్య వాసిరెడ్డి మహిత హైకోర్టులో వ్యాజ్యం వేశారు. మీడియా ట్రయల్ నిర్వహిస్తూ న్యాయవిచారణ ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. నోట్లకట్టలతో వెంకటేష్ నాయుడు ఉన్న వీడియోలను లీక్ చేసిన వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు.
అయితే వెంకటేష్ నాయుడు భార్య ద్వారా ఈ కేసు వేయించడం అనేది కేవలం ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించడానికే అనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వ్యాజ్యం వ్యవహారం ఎలా ఉన్నదంటే.. తప్పు చేసిన వారు కాదు కదా.. ఆ తప్పు గురించి సమాచారం తెలుసుకున్న వారే దోషులు, దొంగలు, దుర్మార్గులు అని వాదిస్తున్నట్టుగా ఉంది.
నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటినుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో దందాలు చేసిన వారంతా తమ తమ ఫోన్లు మార్చేయడమూ, లేదా, అందులోని సమస్త సమాచారాన్ని డిలిట్ చేసి జాగ్రత్తపడడమూ జరుగుతూ వచ్చింది. చాలా వరకు అసలు తమ ఫోను పోలీసుల చేతికి దొరక్కుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే వెంకటేష్ నాయుడు పరిస్థితి వేరు. ఆయన అరెస్టు అవుతానని ఊహించలేదు. ఎందుకంటే అరెస్టు అయ్యేవరకు కూడా మద్యం కుంభకోణం నిందితుల జాబితాలో ఆయన పేరు లేదు. చెవిరెడ్డి భాస్కర రెడ్డితో కలిసి కొలంబో పారిపోతున్న సమయంలో వెంకటేష్ నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్టు చేసేశారు. దాంతో ఆయన వాడుతున్న ఫోను కూడా అనూహ్యంగా పోలీసుల స్వాధీనంలోకి వెళ్లినట్టు అయింది. అందులోని కొన్ని వీడియోలు మాత్రమే ఇప్పటికి బయటకు వచ్చాయి. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ఇంకా అనేక ఆధారాలు అందులో ఉన్నాయని పలువురు సందేహిస్తున్నారు. రహస్యాలు బయటకు వస్తాయనే భయంతోనే.. వైసీపీ పెద్దలు.. వెంకటేష్ భార్య మహితతో కేసు వేయించారని.. తప్పు చేసిన వారే కేసు వేయడం చట్టాల్ని పరిహాసం చేస్తున్నట్టున్నదని ప్రజలు అనుకుంటున్నారు.