వైఎస్సార్.. వైసీపీకి ‘సొత్తు’ కాదంటున్న వైఎస్ షర్మిల!

నాయకుల విగ్రహాలు మన తెలుగురాష్ట్రాల్లో విచ్చలవిడిగా ఉంటాయి. నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాదు, చిన్న చిన్న గ్రామాల్లో కూడా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడం ఇటీవలి కాలంలో అలవాటుగా మారిపోయింది. వీటిపట్ల పెద్దగా అభ్యంతరాలు కూడా వ్యక్తం కావడం జరగదు. ఎప్పుడైనా దుర్మార్గమైన దాడులు జరుగుతాయి తప్ప.. తరచుగా అభ్యంతరాలు ఉండవు. ఇలాంటి నేపథ్యంలో నందిగామ గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చను, ఆలోచనల్ని రేకెత్తిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ‘సొత్తు’ కాదని, ఆపార్టీకి ‘పేటెంట్ హక్కు’లేమీ లేవని వైఎస్ షర్మిల దెప్పిపొడుస్తున్నారు.

వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల తెలుగుప్రజల్లో ఒక వర్గం వారిలో ఉండే ప్రేమను, అభిమానాన్ని కూడా తన ఓటు బ్యాంకుగా మార్చుకోదలచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అనే పేరుతో ఎవరో రిజిస్టరు చేసుకున్న రాజకీయ పార్టీని, ఆయన తాను కబ్జా చేశారు. వారిని భ్రమల్లో పెట్టి.. ఆ పార్టీని తాను సొంతం చేసుకున్నారు. ‘యువజన శ్రామిక రైతు’ అనే పార్టీ పేరును పొడి అక్షరాల్లోకి మార్చి ‘వైఎస్సార్’ అనే నాయకుడిని తలపించేలా ప్రజలను భ్రమింపజేసి.. ఆయన పట్ల ఉండే అభిమానాన్ని తన ఓటుబ్యాంకుగా మార్చుకుని రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వైఖరినే తప్పుపడుతున్నారు షర్మిల.
వైఎస్సార్ ఆ పార్టీయొక్క సొత్తు కాదని అంటున్నారు. నందిగామ గాంధీ సెంటర్లో ప్రభుత్వం ఏర్పాటుచేసిన వైఎస్సార్ బొమ్మను తొలగించడం తగదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి వైఎస్సార్ ను తమ ప్రచారానికి అడ్డగోలుగా వాడుకోవడం అలవాటే. అదేవిధంగా.. నందిగామలో వైఎస్సార్ విగ్రహం చుట్టూతా కూడా వైసీపీ వారు అక్రమంగా రకరకాల సెట్టింగులు వేసుకున్నారని షర్మిల ఆరోపిస్తున్నారు. పార్టీ వారు వేసుకున్న సెట్టింగులన్నీ తొలగించుకోవచ్చు గానీ.. వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం కరెక్టు కాదని షర్మిల అంటున్నారు. తొలగించిన చోట వైఎస్సార్ విగ్రహాన్ని తిరిగి వెంటనే ఏర్పాటు చేయాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆమె అంటున్నారు.

వైఎస్సార్ విగ్రహం తొలగింపు వ్యవహారం సంగతేమో గానీ.. ఆయన పేరు మీద బతుకుతున్న పార్టీ అసలు గుట్టును ప్రజల ముందు పెడుతున్నారు షర్మిల. వైఎస్సార్ కు ఆ పార్టీకి సంబంధమే లేదని అంటున్నారు. వైఎస్సార్ విగ్రహం తొలగింపు వ్యవహారం చుట్టుతిరిగి జగన్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఆ వ్యవహారాన్ని జగన్ పట్టించుకోకపోగా.. షర్మిల సీరియస్ గా తప్పుపడుతున్నారు. జగన్ పార్టీకి తన తండ్రితో సంబంధమే లేదని ఆపార్టీకి అభిమానులుగా ఉన్న ప్రజల్లో అనుమానాలు పుట్టిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories