వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో పలువురు నాయకులను సస్పెండ్ చేయడం వరుసగా జరుగుతూ వస్తోంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి నిర్వహణా చాతుర్యం చూస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు విరక్తి పుట్టి.. వారంతట వారు.. పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. పార్టీనుంచి వెళ్లిపోతున్నవారిని కాపాడుకోవడానికి జగన్ నానా పాట్లు పాడుతున్నారు. వారికి రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు వారికోసం ఏం చేస్తున్నారో చెప్పడం లేదు గానీ.. తన 2.0 సర్కారు వచ్చిన తర్వాత.. ఏం ఉద్ధరిస్తానో చెబుతున్నారు. కార్యకర్తలందరినీ కోటీశ్వరులను చేసేస్తానంటున్నారు. ఈసారి తన సర్కారు ఖచ్చితంగా వస్తుందని ఊరదగొడుతున్నారు. ఒకవైపు పారిపోతున్న వారిని కాపాడు కోవడానికి నానా కష్టాలు పడుతున్న జగన్, మరోవైపు ఎలాంటి కారణాలు చెప్పకుండా కొందరిని ఎందుకు సస్పెండ్ చేసేస్తున్నారు? అనేది కీలకమైన చర్చనీయాంశంగా మారుతోంది.
ఇటీవలి హిందూపురం నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకుడు ఒకప్పటి ఇన్చార్జి నవీన్ నిశ్చల్ ను, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేశారు. నవీన్ నిశ్చల్ వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పటినుంచి కూడా.. ఆయనకు విధేయుడైన నాయకుడు. హిందూపురం నియోజకవర్గంలో పార్టీని బతికించడానికి తన సొంత ఆస్తులు ఖర్చు పెట్టి చాలా కష్టపడ్డారు. హిందూపురంలో బాలకృష్ణ హవాకు ఎదురొడ్డి.. దశాబ్దానికి పైగా తాను విపరీతంగా త్యాగాలు చేశారు. కానీ.. ఆయనకు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. అయితే ఇప్పుడు ఆయనను సస్పెండ్ చేశారు. ఇలా రాష్ట్రంలో చాలా మందిని సస్పెండ్ చేస్తున్నారు. ‘పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు’ అనే ఒకే ఒక వాక్యంతో సస్పెండ్ చేస్తున్నారు.
ఎందుకిలా జరుగుతోందంటే.. అసలు రహస్యం విశ్వసనీయంగా తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాడేపల్లి ప్యాలెస్ నుంచి ప్రతిరోజూ రాష్ట్రంలో నలుమూలల ఉన్న నాయకులకు స్క్రిప్టులు వెళుతుంటాయి. ఆ స్క్రిప్టుల ప్రకారంగా వారు ప్రెస్ మీట్లు పెట్టి కూటమి పార్టీలను తిడుతూ ఉండాలి. వారి సొంత తిట్లు తిడితే కుదరదు. పార్టీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి పంపే తిట్లను మాత్రమే తిట్టాలి. ఆ బురద మాత్రమే చల్లాలి. ఆ స్క్రిప్టులు మాత్రమే ఫాలో కావాలి. కానీ.. కొందరు నాయకులకు ఇది ఇబ్బంది కరంగా ఉంటోంది. కూటమి పార్టీలను తిట్టడానికి వారికి ఓకే గానీ.. తాడేపల్లి స్క్రిప్టుల్లో ఉన్నంత చవకబారుగా.. నీచంగా, లాజిక్ లేకండా తిడితే తమకు వ్యక్తిగతంగా ఉన్న పరువు కూడా పోతుందని వారు భయపడుతున్నారు.
ఇలా తమ ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తూ, తమకు అత్యంత విధేయులుగా పడిఉండకుండా.. సొంత బుర్రలు వాడే వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భరించే, సహించే స్థితిలో లేదు. అందుకే ఇలాంటి నాయకుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇలా మాట వినని నాయకుల్ని సస్పెండ్ చేసేస్తే.. రాష్ట్రంలో మిగిలిన సొంత బుర్ర ఉన్న నాయకులందరికీ క్లియర్ సంకేతాలు పంపినట్టుగా ఉంటుందని పార్టీ భావిస్తోంది. తాము చెప్పినట్టు కూటమిపై బురద చల్లే పని చేయని వారిని బెదిరించడానికి కొన్ని సస్పెన్షన్లు అనివార్యంగా చేస్తున్న్టట్టుగా తెలుస్తోంది. మరి ముందు ముందు పోయే వారు పోగా, గెంటేసే వారిని గెంటేయగా, ఇంకా ఆ పార్టీలో ఎవరు మిగులుతారో వేచిచూడాలి.