వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. హత్య వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు గురించి సుప్రీంలో నడుస్తున్న పిటిషన్ లో తీర్పు రావాల్సి ఉంది. ఈలోగా ప్రస్తుతం.. పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు అనేక అనుమానాలకు కారణం అవుతున్నాయి. దాడులు కూడా వైసీపీ వారే చేయిస్తున్నారా అనే కొత్త అనుమానాలు పుడుతున్నాయి. వివేకా కుమార్తె సునీత కడప జిల్లా ఎస్పీని కలిసి వెలిబుచ్చిన సందేహాలు గమనిస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. అదే సమయంలో.. వివేకా హత్య గురించి ఇన్నాళ్లుగా అంతగా ప్రాచుర్యంలోకి రాని మరో విషయాన్ని కూడా సునీత ప్రస్తావించారు.
తన తండ్రిని హత్య చేసినప్పుడు జరిగిన పరిణామాలను కొన్నింటిని కడపజిల్లా ఎస్పీని కలిసి ఆమె వివరించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిలు రద్దు కోసం పోరాడుతున్న సునీత తాజా పరిణామాలను ఎస్పీకి చెప్పడానికి వెళ్లి కలిశారు. తన తండ్రిని హత్య చేసిన తర్వాత.. ఒక లేఖ తెచ్చి తనను సంతకం పెట్టాల్సిందిగా ఒత్తిడి చేసినట్టుగా సునీత వెల్లడించారు. ఆ లేఖలో.. ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి కలిసి వివేకాను చంపినట్టుగా రాసి.. తనతో సంతకం పెట్టించడానికి ప్రయత్నించినట్టుగా సునీత ఆరోపిస్తున్నారు.
సునీత చెప్పిన సంగతులను ఇతర విషయాలతో అన్వయించుకుంటే ప్రజలకు ఇప్పుడు రకరకాల సందేహాలు కలుగుతున్నాయి. హత్య జరిగిన తర్వాత.. తమ శత్రువులను ఇరికించడానికి ప్రయత్నించారు. అందుకు సునీతను, ఆమె భర్తను వాడుకోవాలని, వారితో సంతకాలు పెట్టించాలని అనుకున్నారు. వర్కవుట్ కాకపోయే సరికి.. చివరికి వారే చంపించినట్టుగా నిందలు వేయడం ప్రారంభించారు. ఇప్పటిదాకా అవే నిందలతో వివేకానందరెడ్డి హత్యను డైవర్ట్ చేయాలని చూశారు- అని తెలుస్తోంది.
ఎస్పీని కలిసినప్పుడు.. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో జరుగుతున్న సంఘటనలను గమనిస్తోంటే.. తన తండ్రి వివేకా హత్య తీరు గుర్తుకు వస్తోందని సునీత అంటున్నారు. తమ బంధువు సురేష్ పై దాడిచేసింది అవినాష్ అనుచరులే అనే అనుమానాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు. చూడబోతే.. పులివెందులలో జడ్పీటీసీ ఉపఎన్నికను అడ్డుపెట్టుకుని.. సునీత వర్గం, సునీత బంధువుల మీద తమ కక్ష తీర్చుకోవడానికి అవినాష్ రెడ్డి వర్గం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
పులివెందుల వ్యవహారాలను దర్యాప్తు చేసే క్రమంలో సునీత ఆరోపణల్ని కూడా పరిగణనలోకి తీసుకుని, ఆమె అనుమానిస్తున్న కోణాల్లో కూడా విచారణ సాగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.