విజయసాయి తో సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు?

ఆనం రామనారాయణరెడ్డి మాటలతో ఇప్పుడు ప్రజలు మరచిపోతున్న వ్యక్తి పేరు మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మూడున్నర వేల కోట్ల రూపాయలను జగన్ దళాలు కాజేసిన లిక్కర్ కుంభకోణంలో అత్యంత కీలకమైన వ్యక్తుల్లో ఒకరుగా భావిస్తున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంగతి ఏమైంది. ఈ కేసులో పలువురు అరెస్టు అయ్యారు. వాళ్లల్లో ఏ ఒక్కరికీ బెయిలు దొరక్కపోగా అందరూ రిమాండులో జైళ్లలోనే ఉన్నారు. మరో కీలక వ్యక్తి  విజయసాయిరెడ్డి. ఆయన సంగతి ఏమైందని తెలుగుదేశం సీనియర్ నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ఇప్పుడు చర్చ లేవనెత్తుతున్నారు. ఏపీలో మద్యం స్కాం సూత్రధారి విజయసాయి రెడ్డేనని ఆయన ఆరోపిస్తున్నారు.

జాగ్రత్తగా గమనిస్తే విజయసాయిరెడ్డి విషయంలో పోలీసులు ఉపేక్ష ధోరణి అనుసరిస్తున్నారేమో అనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఎందుకంటే.. లిక్కర్ స్కామ్ విషయంలో ఏ రకంగా చూసినప్పటికీ కూడా.. అత్యంత కీలక పాత్ర విజయసాయిరెడ్డిది. ఆయనకు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు చెడి ఉండవచ్చు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి ఉండవచ్చు. కానీ.. మద్యం కుంభకోణం దోపిడీని ఆయన చాలా కీలకంగా నడిపించారనేది.. పోలీసుల ప్రాథమిక విచారణలోనే తేలిన సత్యం. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. సాక్షిగా సిట్ ఎదుటకు హాజరై కొన్ని వివరాలు వెల్లడించారు. రాజ్ కెసిరెడ్డి మొత్తం లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి అని, మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచినట్టుగా విజయసాయి వెల్లడించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే అప్పటికే విజయసాయిరెడ్డి తన క్రెడిబిలిటీ కోల్పోయారు. అప్పటికే ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో చెడింది. లిక్కర్ కుంభకోణంలో వసూళ్లను పంచుకోవడంలో రాజ్ కెసిరెడ్డితో వ్యవహారం చెడడం వల్లనే విజయసాయి పూర్తిగా అతడొక్కడినే కార్నర్ చేసినట్టుగా అప్పట్లోనే అందరూ అనుకున్నారు. అలాగే.. విజయసాయిరెడ్డి పాత్ర గురించి ఆయన తొలిసారి విచారణకు వచ్చినప్పుడు చాలా పరిమితంగా మాత్రమే చెప్పుకున్నారు. లిక్కర్ కొత్తపాలసీ రూపకల్పనకు సంబంధించి తొలి విడత సమావేశాలు తన ఇంట్లోనే జరిగాయని.. హైదరాబాదు, విజయవాడ నివాసాల్లో ఈ భేటీలు జరిగాయని మాత్రం చెప్పుకున్నారు.

కానీ ఆ తర్వాత్తర్వాత వేర్వేరు నిందితులను విచారిస్తూ వెళ్లిన నేపథ్యంలో మద్యం ముడుపుల వసూళ్ల నుంచి నెలవారీ మామూళ్లు పుచ్చుకున్న వారిలో విజయసాయిరెడ్డి కూడా కీలకం అని బయటకు వచ్చింది. బిగ్ బాస్ కు అందించే ముందుపులు కాకుండా.. ప్రతినెలా అయిదు కోట్ల వంతున ముడుపుల సొమ్మును ఇద్దరు ఎంపీలు తీసుకుంటూ వచ్చారని.. రాజ్ కెసిరెడ్డి ముఠాను విచారించడంలో వెలుగులోకి వచ్చింది. ఆ ఇద్దరు ఎంపీల్లో ఒకరు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాగా, మరొకరు విజయసాయిరెడ్డే అనేది కూడా బయటకు వచ్చింది.

అలా నెలకు అయిదుకోట్ల వంతున ముడుపుల వాటాలు.. కొన్ని నెలల తర్వాత ఆగిపోయిన నేపథ్యంలోనే ఆయన పార్టీకి దూరమై.. తనకు కిట్టని వారి మీద సిట్ కు పితూరీలు చెప్పినట్టుగా కూడా వెలుగులోకి వచ్చింది.
నిజానికి విజయసాయిరెడ్డి ఈకేసులో ఆరో నిందితుడిగా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ఆయన అరెస్టు జరగలేదు. ఆయన ద్వారా రాగల పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది. గ్యాప్ వచ్చింది గానీ.. ఇప్పుడు ఆనం వెంకటరమణా రెడ్డి లాంటి వాళ్లు విజయసాయిరెడ్డి పాత్రను మళ్లీ బయటకు తెస్తున్నారు. కానీ.. విజయసాయి అరెస్టు లాంటి లాంఛనం ఎప్పటికి జరుగుతుందో అనే అనుమానాలు విశ్లేషకుల్లో సాగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories