‘మార్గదర్శి’ కేసులో రామోజీ కుటుంబానికి ఊరట!

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ఈనాడు అధినేత రామోజీరావును జైలుకు పంపాలనే ఏకైక లక్ష్యంతో ప్రారంభించిన వేధింపుల పర్వానికి తాజాగా తెరపడింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారన్న ఆరోపణలో  దాఖలైన క్రిమినల్ కేసుల విచారణను నిలిపివేసి, ఆ కేసులను కొట్టివేస్తున్నట్టుగా హైకోర్టు తీర్పు చెప్పింది. రామోజీరావు మరణం నేపథ్యంలో ఇక ఆ సంస్థపై కేసును కొనసాగించడంలో అర్థం లేదని తేల్చిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ దాఖలు చేసిన రెండు క్వాష్ పిటిషన్లను అనుమతించింది.

మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ మీద 24 ఏళ్ల కిందట అక్రమ డిపాజిట్లకు సంబంధించిన కేసులు నమోదు అయ్యాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. తన ప్రత్యర్థుల మీద కక్ష తీసుకునే చర్యల్లో భాగంగా రామోజీరావును కూడా టార్గెట్ చేశారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచే రామోజీ సంస్థల విషయంలో ఏమీ చేయలేక, మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో ఒక చిన్న సాంకేతిక లోపాన్ని పట్టుకుని.. వారి మీద కేసులు పెట్టించారు. క్రిమినల్ చర్యలను ప్రారంభించారు. 2008లోనే ట్రయాల్ కోర్టులో కేసు విచారణ ప్రారంభం అయింది. 2011లో ఈ కేసును కొట్టేయాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2018లో ఒకసారి తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్లను విచారించి.. మార్గదర్శికి అనుకూలంగా నిర్ణయం వెలువరించింది. కేసును కొట్టేశారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. కేసు మొత్తాన్ని మళ్లీ సమగ్రంగా విచారించాలంటూ సుప్రీం ఆదేశించింది.

ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ కూడా ఎన్నడో మూతపడినప్పటికీ క్రిమినల్ కేసులు మాత్రం కొనసాగుతూ వచ్చాయి. గత ఏడాది రామోజీరావు కూడా మరణించారు. మార్గదర్శి తరఫున అన్నీ తానే అయి వ్యవహరించిన రామోజీరావు మరణించిన తర్వాత.. క్రిమినల్ కేసు కొనసాగించడానికి అవకాశం లేదని, క్రిమినల్ కేసుల్లో వారసుల మీద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని మార్గదర్శి సంస్థ మధ్యంతర పిటిషన్లు వేసింది. దరిమిలా.. ఆ కేసును పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థ పై ఉన్న కేసులను అడ్డు పెట్టుకుని.. రామోజీరావును అరెస్టు చేయించి ఒక్కరోజైనా జైలుకు పంపాలని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చాలా చాలా ప్రయత్నాలు చేశారు. సీఐడీ సహా ప్రభుత్వ యంత్రాంగాలు అన్నింటినీ రామోజీ మీదకు సంధించి వేధించడానికి ప్రయత్నించారు. అయినా జగన్ కుట్రలు ఫలించలేదు. జగన్ ఓడిపోయినట్టుగా ఎన్నికల ఫలితాలు కూడా వెలువడిన తర్వాత.. రామోజీరావు మరణించారు. ఇప్పుడు ఆ కుట్ర కేసులన్నీ కూడా తేలిపోయాయి. 

Related Posts

Comments

spot_img

Recent Stories