‘ఎవ్వనిచేజనించు.. జగమెవ్వని లోపల నుండు లీనమై..’ అని సాగే పద్యం ఒకటి ఉంటుంది. భగవంతుడిని గురించి చెప్పే పద్యం అది. అదే తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి మరియు ఆయన అనుచరులు ఇప్పుడు కొత్త పద్యాన్ని తయారు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ‘ఎవ్వనిచే జరిగె నేరము.. ధనం ఎవ్వని డెన్ లో దాగి ఉండునో..’ అలాంటి వాళ్లందరినీ ముందుగానే ఏరి తమకు సంబంధం లేదని ప్రకటించడం ద్వారా సేఫ్ జోన్ లోకి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా వెంకటేష్ నాయుడుతో సంబంధం లేదని అనడం, వరుణ్ పురుషోత్తం ఇచ్చిన ఆధారాలతో దొరికిన డబ్బుతోనూ సంబంధం లేదనడం, అదే సమయంలో సాక్షాత్తు భారతీ సిమెంట్స్ శాశ్వత డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ తో కూడా తమకు సంబంధం లేదని చాటుకోవడానికి వారు తహతహలాడడం ఇందుకు ఉదాహరణలే.
అవసరం తీరే వరకు ఓడ మల్లన్న.. అవసరం తీరిన తర్వాత బోడి మల్లన్న అనే అచ్చమైన తెలుగు పల్లెటూరి సామెత బహుశా జగన్మోహన్ రెడ్డికి, ఆయన అనుచరులకు తెలిసినంత బాగా మరెవ్వరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు మూడున్నర వేల కోట్ల రూపాయల సొత్తును కాజేసిన అతిపెద్ద కుంభకోణంలో ఈ సూత్రాన్ని జగన్ పదేపదే నిరూపిస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక అక్రమాల సామ్రాజ్యంలో గోవిందప్ప బాలాజీ చాలా చాలా కీలకమైన వ్యక్తి. జగన్ ఆర్థిక వ్యవహారాలు చూడడం మాత్రమే కాకుండా, భారతి సారథ్యంలోని అన్ని వ్యాపారాల ఆర్థిక లావాదేవీలను కూడా ఆయనే చూస్తుంటారని పేరు. జగన్ దంపతుల తరఫు పెట్టుబడులను కూడా ఆయనే ప్లాన్ చేస్తుంటారని అంటుంటారు. అందుకే సీఎఫ్ఓతోపాటు ఆయన భారతి సిమెంట్స్ లో శాశ్వతకాల డైరక్టరుగా ఉన్నారు. అయితే.. మద్యం కుంభకోణంలో నిందితుడిగా అరెస్టు అయినప్పటినుంచి గోవిందప్ప బాలాజీ తో తమకు సంబంధం లేదన్నట్టుగా చాటుకోవడానికి జగన్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. ఆయన అంతర్జాతీయ స్థాయిలోని వికాట్ కంపెనీ డైరక్టరు అని అంటున్నారు. గోవిందప్ప బాలాజీని అరెస్టు చేయడం ద్వారా.. వికాట్ వంటి అంతర్జాతీయ కంపెనీలను చంద్రబాబునాయుడు బెదిరిస్తున్నారని కొత్త పాట అందుకున్నారు.
వరుణ్ పురుషోత్తం పోలీసుల చేజిక్కి ఒక డంప్ లో దాచిన ముడుపుల సొమ్ము గుట్టు కూడా చెప్పేసిన తర్వతా.. వరుణ్ తో సంబంధం లేదన్నట్టుగా వారు మాట్లాడుతుండడం విశేషం. అప్పటిదాకా కేసులో అతని పేరు కీలకంగా వినిపించినా నిందితులు ఎవ్వరూ పెద్దగా ప్రస్తావించలేదు. ఒకసారి అతని ద్వారా.. దాచిన డబ్బు బయటకు రాగానే.. అతనితో సంబంధం లేదని, ఆ డబ్బుతో సంబంధం లేదని అంటున్నారు. అలాగే.. వెంకటేశ్ నాయుడు పరిస్థితి కూడా మారుతోంది. నోట్లకట్టలతో అతని వీడియోలు సంచలనం సృష్టించిన తర్వాత.. రకరకాలుగా వదిలించుకునే ప్రయత్నిలు కనిపిస్తున్నాయి.
మాటల్లో ఎందరు నిందితులతో తమకు సంబంధం లేదని వారు చెప్పుకున్నప్పటికీ.. చేసిన పాపం మాత్రం జగన్మోహహన్ రెడ్డిని విడిచిపెట్టదని, ఆయన మూడున్నర వేల కోట్లు కాజేసిన నేరానికి తగిన శిక్ష అనుభవించాల్సిందేనని ప్రజలు భావిస్తున్నారు.