అధికారిక ప్రకటన వచ్చేసింది. రాష్ట్రంలోని మహిళలు ఎదురుచూస్తున్న దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రయోజనం చేకూర్చడానికి ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేది కేవలం వారి సొంత జిల్లాలకు మాత్రమే కాదు. రాష్ట్రవ్యాప్తంగా వర్తించనుంది.
సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినప్పుడు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, ఉపాధులను మెరుగుపరుచుకోవడం కోసం ఉద్దేశించారు. సొంత జిల్లాలకే ఉచిత ప్రయాణ అవకాశం పరిమితం చేస్తే చాలునని సంకల్పించారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ అంశాలను, అధ్యయన ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర మహిళలకు మరింత విస్తృతమైన అవకాశాలు కల్పించడానికి వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ప్రయాణం అవకాశం కల్పించనున్నట్టుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి ఈ విధానం అమలులోకి రాబోతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం ఐదు రకాల ఆర్టీసీ బస్సులలో వీరు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ లలో ఈ ఉచిత ప్రయాణ అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణ సమయంలో మహిళలు తమ వెంట ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు,రేషన్ కార్డులలో ఏదో ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది. గతతంలో పాన్ కార్డు కూడా అని ప్రకటించారు గానీ.. తుది విధానాల తర్వాత దానిని తొలగించారు.
ఆరవ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి ఆమోదం లభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. దీనికి వయోపరిమితులు కూడా విధించడం లేదు. రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఆర్టీసీ వద్ద ప్రస్తుతం ఉన్న వాటిలో 74శాతం అంటే 6700 బస్సులను ఉచిత ప్రయాణం కోసం కేటాయించినట్లుగా మంత్రి ప్రకటించారు. ఈ స్త్రీ శక్తి పథకం వలన.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ మీద ఏడాదికి 1950 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఆర్టీసీ భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా త్వరలో మరో మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయబోతున్నట్టుగా మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు.
మొత్తానికి ఏడాదిగా రాష్ట్ర మహిళలు ఎదురుచూస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ అవకాశం కార్యరూపంలోకి వస్తుండడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకునే నాయకుడు కాదని చెప్పిన వాగ్దానం అమలు చేయరని జగన్మోహన్ రెడ్డి దళాలు గోల చేస్తుండగా వారి నోర్లకు తాళాలు వేసే లాగా ప్రభుత్వం ఒక్కటి ఒక్కటి అమలులో పెడుతూ పోతోంది. ఆ క్రమంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా చాలా కీలకమైన హామీ అని పలువురు భావిస్తున్నారు. దీనితో సూపర్ సిక్స్ హామీలలో దాదాపుగా 80 శాతం వరకు ప్రభుత్వం పూర్తి చేసినట్లే అనుకుంటున్నారు.