మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి చెందిన మంత్రులను హత్య చేయిస్తే ఎలా ఉంటుంది? అనే కోరికను ఆయన బయటపెట్టారు. ‘మేమూ మా వాళ్లను మంత్రులు, మీ ఎమ్మెల్యేల ఇళ్లపైకి పంపి హత్య చేయించే కార్యక్రమం మొదలు పెడితే ఏం చేస్తారు’ అంటూ జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయారు. నెల్లూరు యాత్రలో జైల్లో ఉణ్న మాజీ మంత్రి కాకాణి గోవర్దనరెడ్డిని జైల్లోను, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి ఒక రేంజిలో రెచ్చిపోయారు. బూతులు తిట్టిన ప్రసన్నకుమార్ రెడ్డి మీద తెలుగుదేశం కార్యకర్తలు వెళ్లిన సంఘటనను ఆయన హత్యాప్రయత్నంగా అభివర్ణించి తన బుద్ధిని బయటపెట్టుకున్నారు. అలా ఇలా మెలితిప్పి.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, మంత్రుల మీదికి హత్యలకు మా మనుషుల్ని పంపిస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ తరహా పరామర్శలకు వెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రవచనాలు చాలా చాలా చిత్రంగా ఉంటున్నాయి. రాజకీయాల్లో విమర్శలు ఏ రకంగా ఉంటాయో ఆయన చెబుతున్నారు. ఒకరిమీద మరొకరు మీడియాలో ప్రకటనలు చేసుకోవడం చాలా సహజం అంటున్నారు. ఒకరు ఏ భాషలో మాట్లాడితే.. మరొకరు కూడా అదే భాషలోనే మాట్లాడతారు కదా.. అని జగన్ చెబుతున్నారు. ఆయన వాదన కరక్టే కావొచ్చు. కానీ.. ఈ మాటల మాయాజాలంలో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీచత్వాన్ని జగన్ ఎలా సమర్థించగలరు.. అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు.
ఎమ్మెల్యేగా ఉండగా.. నల్లపురెడ్డి పాల్పడిన అవినీతి గురించి, వేమిరెడ్డి ప్రశాంతి విమర్శిస్తే..నల్లపురెడ్డి ఆమె పెళ్లి గురించి, ఆమె వ్యక్తిగత జీవితం గురించి అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. తనకు చెల్లెలి వరుస అయ్యే మహిళపై కనీస సంస్కారాన్ని మరచిపోయి మాట్లాడారు. అయినా సొంత చెల్లెలి మీద తన అనుచర గూండాలతో అసభ్యపు నీచమైన పోస్టులు పెట్టించే జగన్మోహన్ రెడ్డకి, నల్లపురెడ్డి వంటి అనుచరులు చేసే నీచత్వాలు సత్కార్యాల్లాగానే కనిపిస్తాయి కదా అని ప్రజలు అంటున్నారు.
విడదల రజనిమీద, రోజా మీద వ్యాఖ్యలు చేశారని జగన్ అంటున్నారు. కానీ.. ఏ ఒక్కరు కూడా నల్లపురెడ్డి అంత నీచంగా ఎన్నడూ మాట్లాడలేదని జగన్ మర్చిపోతున్నారు. నగరిలో గతంలో రోజా పాల్పడిన అవినీతి గురించి గాలి భానుప్రకాష్ వెల్లడిస్తే.. జగన్ పనిగట్టుకుని దానిని బూతులుగా వక్రీకరించి రోజా పరువు తీసిన సంగతి కూడా అందరికీ తెలుసు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని నీచంగా మాట్లాడినందుకు, ప్రజలు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తే.. దానిని హత్యాయత్నంకింద వక్రీకరిస్తున్నారు. ఆ రోజు ప్రసన్న ఇంట్లో ఉంటే చంపేసి ఉండేవారని జగన్ అంటున్నారు. ఆ తర్వాతిరోజునుంచి ప్రసన్న ఇప్పటిదాకా అదే ఇంట్లోనే ఉన్నారు కదా.. మరి ఏమీ జరగలేదుకదా.. అనే సంగతి ఆయన దాచిపెడుతున్నారు. దానికి హత్యాయత్నంగా రంగుపులిమి.. ఇప్పుడు కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల మీదికి తమ పార్టీ వారిని హత్యలు చేయమని పంపిస్తే ఏమవుతుందో తెలుసా..? అంటూ తన మనసులోని కోరికను ఆయన బయటపెడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని మరింతగా విచ్ఛిన్నం చేయడమే తన లక్ష్యం అన్నట్టుగా ఆయన పార్టీ వారిని రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తోంది.