వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ ప్రజలను మభ్య పెట్టి అధికారం దక్కించుకుని.. ప్రజలకు డబ్బులు పంచిపెడుతూ.. తనకు స్థిరమైన ఓటు బ్యాంకు తయారవుతుందనే భ్రమలో కొన్ని కుట్రపథకాలను అమలు చేశారు. ‘జగన్ డబ్బులు ఇవ్వని కుటుంబం రాష్ట్రంలోనే లేదు’ అని టముకు వేసుకుంటూ.. అక్కడికేదో తన సొంత జేబునుంచి డబ్బులు పంచిపెడుతున్నట్టుగా వాలంటీర్లతోను, పార్టీ నాయకులతోనూ అతిగా డప్పు కొట్టించుకున్నారు కూడా.
కానీ.. వాస్తవంలో గమనించినప్పుడు ఆయన చెప్పిన పథకాలు తప్ప.. రాష్ట్రప్రభుత్వం బాధ్యతగా చేపట్టాల్సిన అనేక చెల్లింపుల విషయంలో ఆయన రిక్తహస్తం చూపించినట్టుగా, కేంద్రం పథకాలకు కనీసం మ్యాచింగ్ సొమ్ములు కూడా ఇవ్వకుండా ప్రజలను మోసం చేసినట్టుగా ఇప్పుడు అనేక వివరాలు బయటకు వస్తున్నాయి. తాజాగా పార్లమెంటు సాక్షిగా జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వ కాలంలో.. ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద రైతులుకు చెల్లించాల్సిన డబ్బు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదని తేలింది. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు.
రాజస్తాన్ ఎంపీ హనుమాన్ బేనివాలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫసల్ బీమా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న రాష్ట్రాల తీరును ఆయన ప్రస్తావించారు. కొందరు తమ వాటా ఇవ్వడం లేదని, మరికొందరు ఆలస్యం చేస్తున్నారని అంటూ.. జగన్ సర్కారు మూడేళ్లపాటు రైతులకు ఫసల్ బీమా యోజన డబ్బులు అస్సలు ఇవ్వకపోయినా కేంద్రం సకాలంలో అమలు చేసిందని అన్నారు. రాష్ట్రాలు సకాలంలో వారి వాటా డబ్బులు ఇవ్వకపోతే 12 శాతం వడ్డీ కలిపి రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని కేంద్రమంత్రి వెల్లడించారు.
ఈ మాటలు గమనిస్తే అసలు జగన్ ఎన్ని రకాలుగా రాష్ట్రాన్ని వంచించారో అర్థమవుతుంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు 200 కోట్ల సాయం అందిస్తే ఆ సొమ్ములను కూడా ఆ పనులకోసం ఖర్చు పెట్టకుండా దారిమళ్లించి ఇతర పథకాలకు ఖర్చు పెట్టుకున్న జగన్ ఘనత రెండు రోజుల కిందటే బయటకు వచ్చింది. కేంద్రం డబ్బులకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ వేసి ఇవ్వాల్సినదానికి బదులుగా.. ఆ డబ్బే దారి మళ్లించారు. దాంతో కేంద్రం ఆ డబ్బు మొత్తం వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని రాష్ట్రానికి ఫత్వా జారీచేయడంతో విషయం వెలుగుచూసింది.
ఇదొక ఘోరం అయితే.. రైతుల ఫసల్ బీమా విషయంలో జగన్ చేసిన వంచన మరో ఎత్తు.
జగన్మోహన్ రెడ్డి కేవలం పథకాల మాయ చేస్తూ.. ఏదో చేసేస్తున్నట్టుగా ప్రజల్ని భ్రమింపచేయడానికే పాలన సాగించారనేది ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. కానీ.. జగన్ మ రోవైపు తన కార్యక్రమాలకు కిరాయి జనాల్ని తోలించుకుంటూ.. తనమీద జనాభిమానం వెల్లువలా పొంగుతోందని ప్రచారం చేసుకోవడం చాలా అసహ్యంగా కనిపిస్తోంది. ఆయన పాలనకాలంలో చేసిన వంచనలు ఒక్కటొక్కిటీ బయటపడుతున్నక కొద్దీ.. ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతోంది. ఆయన దుర్మార్గాలు ఇప్పటికూటమి ప్రభుత్వానికి అదనపు భారంగా మారుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.