నేరాలు, పాపాలు, అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యాప్రయత్నాలు చేస్తున్నప్పుడు.. వాటికి ఒక లిమిట్ ఉండాలని వారు ఎన్నడైనా చూసుకున్నారో లేదో మనకు తెలియదు. కానీ తాము చేసిన పాపాలకు సంబంధించి పోలీసులు కేసులు నమోదు అవుతూ ఉండే మాత్రం వారికి చాలా కంటగింపుగా ఉంది. ఇప్పటికి ఇన్ని కేసులు నమోదు అయ్యాయి గనుక.. ఇక మీదట తమ మీద కేసులు నమోదు కావడానికి కూడా వీల్లేదు.. అని వారు ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. జగన్ భక్త అనుచర గూండా గణాల్లోని ఒక కీలక నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడు అయిన తురకా కిశోర్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తురకా కిశోర్ రిట్ పిటిషన్ ను విచారణకు స్వీకరించకుండా సుప్రీం డిస్మిస్ చేసింది.
వివిరాల్లోకి వెళితే..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో.. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని చెలరేగిపోయిన అనేకమంది గూండాల్లో మాచర్ల వైసీపీ నాయకుడు తురకా కిశోర్ కూడా ఉన్నారు. మాచర్లలో వైసీపీవారి దాడులకు బలవుతున్న తమ పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లిన తెలుగుదేశం నాయకులపై హత్యాయత్నం చేసిన వ్యక్తి ఈ తురకా కిశోర్. అపరిమిత దౌర్జన్యాలకు పాల్పడుతున్నందుకు అభినందిస్తూ పిన్నెల్లి సోదరులు తమ అనుచరుడికి మాచర్ల మునిసిపల్ ఛైర్మన్ పదవిని కూడా కట్టబెట్టారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడ్డు రోజులు తప్పవని భయపడిన ఆయన పరారీలోకి వెళ్లారు. ఈలోగా ఆయన మునిసిపల్ ఛైర్మన్ పదవి కూడా పోయింది. తర్వాత పోలీసులకు చిక్కారు. రిమాండులోకి వెళ్లారు. ఆయన చేసిన వివిధ నేరాలకు సంబంధించి ఇప్పటికే 9 కేసుల వరకు నమోదై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇకమీదట తనపై ఎలాంటి కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు.
ప్రభుత్వం ఇంకా తనమీద కేసులు పెట్టేందుకు సిద్ధం అవుతున్నదని ఆయన అనుమానం. నేరాలు చేసినప్పుడు ఆయనకు పరిమితులు గుర్తు రాలేదు గానీ.. 9 కేసులు కాగానే.. ఇక చాలు ఆపండి అనాలని అనిపించినట్టుంది. అయితే అలాంటి పప్పులేవీ ఉడకవని సుప్రీం కోర్టు ఆ పిటిషన్ ను తిరస్కరించింది. దాంతో కొత్త కేసుల గురించిన భయంతోనే తురకా కిశోర్ గడపాల్సిన పరిస్థితి ఎదురైందని ప్రజలు అనుకుంటున్నారు.