వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హైటెక్ బాటలోకి వస్తున్నారు. ఆయన పార్టీ నిర్ణయాలను ప్రస్తుతం ప్రభావితం చేస్తున్న వ్యక్తులు ఎవ్వరో గానీ.. మొత్తానికి ఆయన హైటెక్ కంప్యూటరైజ్డ్ పద్ధతుల్లో తన పార్టీ నిర్వహణ చేయాలని అనుకుంటున్నారు. ఒక యాప్ క్రియేట్ చేసి (ఒక వెబ్ సైట్ అని కూడా పార్టీనేతలు అంటున్నారు) దాని ద్వారా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇంతకూ యాప్ ద్వారా ప్రజలకు చేరువ కావడం అంటే ఏంటనుకున్నారు.. యాప్ ద్వారా సాధించగల ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? పగ తీర్చుకోవడం మాత్రమే, ప్రతీకారం చెల్లించుకోవడం మాత్రమే.! పగప్రతీకారాలకోసం ఒక యాప్ సృష్టించి వ్యవస్థీకృతంగా ఫ్యాక్షనిజం ను నడిపే మహానాయకుడు ప్రపంచంలో బహుశా జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఉంటారని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
బెంగుళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ కు తరలివచ్చిన జగన్మోహన్ రెడ్డి రెండురోజులుగా పార్టీ కార్యక్రమాల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. సోమవారం సాయంత్రం ఆయన భార్య భారతితో కలిసి.. రాజ్ భవన్ కు వెళ్లి గవర్నరు అబ్దుల్ నజీర్ తో గంటకు పైగా భేటీ అయ్యారు. అక్కడినుంచి బయటకు వచ్చాక వేచి ఉన్న మీడియా ప్రతినిధులు కేకలు వేస్తూ ఉన్నా పట్టించుకోకుండా, మీడియాను ఉద్దేశించి ఒక్క మాటైనా మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్లిపోయారు. గవర్నరుతో భేటీలో ఏం మాట్లాడారు? ఏం కోరారు? ఆయన ఏం చెప్పారు? అనేదానిపై గోప్యం పాటించారు.
అలాగే మంగళవారం ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో పార్టీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో ఆయన ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. అదే పార్టీ ప్రతీకారం తీర్చుకోవడం ఒక యాప్ ను అందుబాటులోకి తేవడం.
ఒక యాప్ సృష్టిస్తారట. రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త తమ నియోజకవర్గంలో తమకు ఏదైనా అన్యాయం జరిగితే, తమను కూటమి పార్టీలకు చెందిన వారు, ఏమైనా అంటే, అధికారులు తాము చెప్పినట్టుగా వినకపోతే వారిమీద ఈ యాప్ లో ఫిర్యాదులు నమోదు చేయవచ్చునట. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆ యాప్ లో పేర్లు ఉన్న అందరి మీద కక్ష తీర్చుకోవడం షురూ చేస్తారట. వడ్డీతో సహా వారందరికీ చెల్లిస్తారట. ఈరోజు పార్టీ పీఏసీ సమావేశంలో జగన్ తీసుకున్న మేజర్ నిర్ణయం అదే. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కూడా ఒక వ్యవస్థీకృత ఆన్ లైన్ విధానాన్ని తీసుకువచ్చిన మహానుభావుడు ప్రపంచంలో బహుశా జగన్ ఒక్కరే అయి ఉండవచ్చునని ప్రజలు అనుకుంటున్నారు.