యంగ్ హీరో సందీప్ కిషన్ త్వరలో ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా మొదట నితిన్‌తో ప్రారంభమవ్వాల్సింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అప్పట్లో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ అదే కథను చిన్న మార్పులతో రీడిజైన్ చేసి దర్శకుడు కృష్ణ చైతన్య ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు.
కృష్ణ చైతన్య ఇప్పటివరకు గేయరచయితగా పేరు తెచ్చుకున్న తర్వాత, దర్శకత్వంలోకి వచ్చిన వ్యక్తి. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఎనర్జీతో ‘పవర్ పేట’ అనే సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈసారి ఈ చిత్రంలో హీరోగా సందీప్ కిషన్ నటించనున్నాడని సమాచారం. కథలో కొన్ని మార్పులు చేసిన తర్వాత దర్శకుడు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఇక ఈ సినిమాను 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఈ ప్రాజెక్ట్‌ను ఆగస్టు 9న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.