వెంకయ్య మాట సూపర్.. ఆమెలాంటి వారికి షాక్!

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆదివారం నాడే తిరుమలకు చేరుకున్న వెంకయ్య.. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉచిత భోజనప్రసాదాన్ని స్వీకరించారు. సోమవారం ఉదయం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని విలువైన సూచనలు కూడా చేశారు. వీఐపీ కేటగిరీలోకి వచ్చే భక్తులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమలేశుని సేవకు రావాలని, అలా చేయడం వలన సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని, ప్రజాప్రతినిధులు, నాయకులు, వీఐపీ కేటగిరీలోని అధికారులు కూడా తమ హోదాకు తగిన హుందాతనం పాటించాలని వెంకయ్యనాయుడు హితవు చెప్పారు. అయితే.. ఇది తిరుమలేశుని దర్శనాన్ని కూడా తమ వ్యాపార అవకాశంగా మార్చుకునే అనేకమంది నాయకులకు ఒక షాక్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.
తిరుమలేశుని దర్శనం విషయంలో వీఐపీలుగా పరిగణించే నాయకులు, ప్రజాప్రతినిధులే విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉండడం కొత్త సంగతి కాదు. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫారసు ఉత్తరాలు ఇచ్చే తమ హోదాను డబ్బుకోసం అమ్ముకుంటున్న ప్రబుద్ధుల వ్యవహారాలు అనేకం నిత్యం వెలుగుచూస్తూనే ఉంటాయి. అదే సమయంలో.. ఈ వీఐపీ కేటగిరీలోని వారు స్వయంగా దర్శనానికి వెళ్లినప్పుడు ప్రత్యేకమైన ప్రోటోకాల్ దర్శనం ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేలు లాంటి వాళ్లు వెళ్లినప్పుడు కేవలం.. వారి వెంట ఆరుగురు మాత్రమే కాకుండా.. ఎక్కువ మందిని దర్శనానికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంటుంది.

సిఫారసు లెటర్లను అమ్ముకునే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మందే ఉంటారు. ఒక్కొక్క బ్రేక్ దర్శనాన్ని పదివేల రూపాయలకు పైగానే అమ్ముకుంటూ ఉంటారు. కానీ.. స్వయంగా వారు ప్రోటోకాల్ మర్యాదలతో వెంటతీసుకువెళ్లే బ్యాచ్ లను కూడా మారుస్తూ అందులో కూడా వ్యాపారం చేసేవాళ్లు అనేకమంది ఉంటారు. చిత్తూరు జిల్లాకే చెందిన ఒక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై ఇలాంటి ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. ఆమె దాదాపుగా ప్రతినెలా ఒక్కసారైనా స్వయంగా తిరుమలేశుని దర్శనానికి వెళ్తుండేవారు. దర్శనానంతరం బయటకు వచ్చిన తర్వాత.. జగనన్న పరిపాలన ప్రజలందరికీ మంచి చేయాలని దేవుడిని కోరుకున్నట్టుగా ప్రతిసారీ చెబుతారు. పనిలోపనిగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లను నానా తిట్లు తిట్టేవారు. అక్కడితో ప్రతినెలా సాగే దర్శనపర్వం ముగుస్తుంది. కానీ.. ఆమె అధికార్లను దబాయించి మరీ ప్రతిసారీ తన వెంట 30 మంది వరకు భక్తుల్ని దర్శనానికి తీసుకువెళ్తుండేవారని, ఇలాంటి దర్శనాలు చేయించడం ద్వారా ప్రతినెలా కొన్ని లక్షల రూపాయలు సంపదిస్తుండేవారని ఆరోపణలున్నాయి. ఆమె పీఏ స్వయంగా ఇదే పనిమీద ఉంటూ.. మేడం సిఫారసు మీద, మేడం తోకలిసి దర్శనానికి వెళ్లేవారిని గుర్తించి.. వారితో దందా నడిపిస్తుండేవారని ఆరోపణలున్నాయి.

ఇలాంటి వారికి వెంకయ్యనాయుడు సలహా, వారి బిజినెస్ ను దెబ్బ తీయవచ్చు. నిజానికి ఆయన సలహా అనేక మంది నాయకులకు రుచించకపోవచ్చు. ఈ విషయంలో టీటీడీ యాజమాన్యమే నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాలి. వీఐపీ హోదాలోని వారికి సిఫారసు ఉత్తరాలు ఇచ్చే విషయంలో ఒక విధానం, పరిమితి ఉన్నట్టే.. వారు స్వయంగా దర్శనానికి వచ్చే విషయంలో కూడా పరిమితి విధించాలి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇలా అనుమతించే పద్ధతి తెస్తే అందరికీ చాలా గౌరవప్రదంగా ఉంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories