‘అసలు లేని స్కామ్ ను చంద్రబాబునాయుడు సృష్టించి, ఆ స్కామ్ లో అధారాలను అన్నీ ఫాబ్రికేట్ చేస్తూ.. తమ పార్టీ వారిని కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు’ ఇదీ.. కొన్ని నెలలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడుతున్న పాట. కానీ.. ముడుపులు ఇచ్చిన డిస్టిలరీల యజమానులు స్వయంగా న్యాయాధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలు కూడా వారి వసూళ్లవైపు, బదిరింపులవైపు, సాగించిన దందావైపు వేలెత్తి చూపిస్తోంటే.. ఇంకా బుకాయించగలమని ఎలా అనుకుంటున్నారు. ఎలా సాధ్యమవుతుందని అనుకుంటున్నారో తెలియదు. మొత్తానికి 300 కోట్ల రూపాయలకు పైగా.. తాను పొందిన భారీ ఆర్డర్లకు ప్రతిఫలంగా జగన్ దళాలకు, వసూళ్ల నెట్వర్క్ పెద్దలకు ముట్టజెప్పిన డిస్టిలరీ యజమాని స్వయంగా న్యాయాధికారి ఎదుట ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు కీలక అంశాలను బయటపెడుతోంది.
తమ బెదిరింపులకు లొంగిన, దందాలకు అంగీకరించిన డిస్టిలరీల యజమానుల నుంచి ఏకంగా మూడున్నర వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళాలు.. అలా మద్యం తయారీ దార్లను లొంగదీసుకోవడానికి.. పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం, చాటుమాటుగా సంప్రదించడం లాంటివేమీ చేయలేదు. తమను ఎవ్వరూ ఏమీ చేయలేరు అనే ధీమా వారిలో ఎంతగా ఉండేదంటే.. ఏకంగా సీఎంఓ నుంచే ఫోను చేస్తున్నట్టుగా చెప్పుకుని మరీ.. డిస్టిలరీల యజమానులు తమకు ముడుపులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవతలి వాళ్లు తమ బెదిరింపులు నమ్మి, లొంగి తమ డీల్ కు అంగీకరించిన తర్వాతనే.. వారికి అప్పటిదాకా రావాల్సి ఉన్న బిల్లుల చెల్లింపు ప్రాసెస్ అయ్యేలా చూశారు. అప్పటిదాకా కొత్త ఆర్డర్లు కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టారు. లిక్కర్ పాలసీ ద్వారా దోచుకోవడానికి ఏమాత్రం ఇబ్బంది రాకుండా.. ఎంత విచ్చలవిడిగా వ్యవహరించారనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ.
జగన్ జమానాలో అత్యధికంగా మద్యం ఆర్డర్లు దక్కించుకునన్న సంస్థల్లో ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రోడక్ట్స్ సంస్థ కూడా ఒకటి. వీరికి ఏకంగా 2365 కోట్ల రూపాయలకు పైగా ఆర్డర్లు దక్కాయి. ఇందకు ప్రతిఫలంగా వారు 300 కోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకున్నారు. ఈ ఎస్ఎన్‌జే యాజమాన్యాన్ని బెదిరించడం ద్వారానే వారి అనుబంధ సంస్థ లీలీ డిస్టిలరీస్ ను రాజ్ కెసిరెడ్డి తన గుప్పిట్లో పెట్టుకుని.. ఇంకో పెద్ద దందా నడిపించిన సంగతి కూడా అందరికీ తెలుసు. ఆ డిస్టిలరీస్ పేరుతో ఏకంగా 453 కోట్ల ఆర్డర్లు వెళ్లాయి. ఆ సొమ్ము మొత్తం రాజ్ కెసిరెడ్డికే చేరినట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇలా ఆ సంస్థలు డీల్ దక్కించుకోవడమూ, ముడుపులు ఇవ్వడమూ అంత సులువుగా ఏమీ జరగనేలేదు.
ఆ సంస్థ సీఎఫ్ఓ నల్లవన్ మతప్పన్ కు నిందితుడు బూనేటి చాణక్య 2020 అక్టోబరు ప్రాంతంలో పలుమార్లు కాల్ చేసి తాను ఏపీ సీఎంఓ నుంచి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకున్నారు. మీ బ్రాండ్లకు ఆర్డర్లు కావాలన్నా, మీకు పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలన్నా.. మేం అడిగినంత ఇవ్వాలని బెదిరించారు. తొలుత వారు ఆకతాయి కాల్స్ గా భావించా పట్టించుకోలేదు. కానీ.. ఆర్డర్లు తగ్గిపోవడంతో పాటు, బిల్లలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ తర్వాత బివరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని కలిసినప్పుడు.. చాణక్య చెప్పినట్టుగా చేయండి అని ఆయన సూచించినట్టు వారు వాంగ్మూలంలో పేర్కొన్నారు.
కేవలం లిక్కర్ వ్యాపారంలో అడ్డగోలుగా దండుకోవడానికి సాక్షత్తూ సీఎంవో పేరు చెప్పి దందా సాగిస్తే.. అసలు లేని స్కామ్ ను సృష్టించి కక్షపూరిత అరెస్టు చేస్తున్నారు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఆయనది ధృతరాష్ట్ర పాలన అనుకోవాలా? లేదా, ప్రజలను ఒకసారి మోసం చేసినట్టే.. తాను రకరకాల బుకాయింపు మాటలు చెప్పి అందరినీ ఎప్పటికీ మోసం చేయగలననే విశ్వాసంతో ఉన్నారని అనుకోవాలా? అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.