జగన్ అమసర్థతల్ని డప్పు కొట్టిచెబుతున్న సజ్జల!

ఒక పార్టీకి ఒక అధినేత ఉంటారు. సర్వాధికారిగా సకల నిర్ణయాలు తానే తీసుకుంటూ ఉంటారు. సకల వ్యవహారాలను తానే నిర్దేశిస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఉండే పార్టీ సంగతి కొంచెం తేడాగా ఉంటుంది గానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ వంటి వ్యక్తిస్వామ్య పార్టీలలో ఈ పోకడ మరింత ఎక్కువగా ఉంటుంది. జగన్ ఏది చెబితే అది శాసనంగా నడుస్తూ ఉంటుంది. నిజానికి వైసీపీ కూడా అలాగే నడుస్తూ ఉంది. కానీ.. పార్టీ అధినేతగా ఉండే వ్యక్తి ఏయే విషయాలలో చొరవ చూపించాలి.. ఏయే విషయాల్లో ప్రజల ముందుకు, ఏ విషయాల్లో మీడియా ముందుకు వస్తూ ఉండాలి.. అని బాహ్య ప్రపంచం సాధారణంగా ఆశిస్తూ ఉంటుందో.. అది మాత్రం వైసీపీలో జరగదు. ‘అధినేత ఈ విషయంపై మాట్లాడాలి..’ అని అందరూ అనుకునే ప్రతి సందర్భంలోనూ తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు సజ్జల రామక్రిష్ణారెడ్డి వస్తుంటారు. జగన్ కు మీడియాను ఫేస్ చేయడం, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయడం అనేది చేతకాదు.. అని చాటిచెప్పడానికే తాను ఉన్నట్టుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి బాహ్యప్రపంచానికి సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉన్నదని పలువురు భావిస్తున్నారు.

సాధారణంగా పార్టీ అధికారానికి దూరమై ఒక ఏడాది గడిచిపోయింది.. లేదా, ప్రభుత్వం సరిగ్గా పెర్ఫార్మ్ చేయడం లేదు అని విపక్షం భావిస్తోం. ఇలాంటి  సందర్భాల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం అంటూ జరిగితే.. ఇవ్వాల్సింది ఎవరు? సాక్షాత్తూ పార్టీ అధినేతే కదా? కానీ.. వైసీపీలో మాత్రం అంతా భిన్నం. అక్కడ జగన్ కు బదులుగా సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆ పాత్ర పోషిస్తుంటారు. ఈ పార్టీకి జగన్ కాదు- అన్నీ తానే అని ఆయన నిరూపిస్తూ ఉంటారు.

ఫరెగ్జాంపుల్- రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రహసనప్రాయమైన కార్యక్రమం నిర్వహించడానికి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ నాయకులు అందరినీ.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి నిరంతరాయంగా ఫాలో అప్ లు చేస్తూ ఉన్నారు గనుక చాలా మంది నాయకులు ఆ కార్యక్రమాలు తమతమ నియోజకవర్గాల్లోనూ, తాము ఇన్చార్జిలుగా ఉన్న జిల్లాల్లోను నిర్వహించారు. మమ అనిపించారు. వీటిలో బహిరంగ సభలాంటి కార్యక్రమాలు గాని, జనాన్ని పోగేసి వారిలో ప్రభుత్వ వైఫల్యం మీద అవగాహన కలిగించే ఒక నిర్మాణాత్మక కార్యక్రమం గానీ లేనేలేవు. ఇప్పటిదాకా జరిగినవన్నీ కూడా కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు మాత్రమే. వారు పార్టీ కార్యకర్తలే అయినప్పుడు.. వారు పార్టీ ఏం చెప్పినా, ఏం చేస్తున్నా ఆ లైన్స్ కు కట్టుబడే ఉంటారు కదా.. వారితో మళ్లీ ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని సాధించేది ఏముంటుంది.? అంతగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే.. తమ పార్టీ వారి ముందే ఆ సోది మొత్తం మళ్లీ వినిపించడం కాకుండా ప్రజల్లోకి కదా వెళ్లాలి.. అనే వాదన సర్వత్రా వినిపిస్తూ ఉంది. అయితే ఆ ఆలోచన పార్టీకి ఇప్పుడే కలిగినట్టుగా ఉంది.

సజ్జల రామక్రిష్ణారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలోని కీలక మండల లెవెల్ నాయకులతో కూడా ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పుడు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని మండల లెవెల్ దాటి.. ప్రజల్లో గడపగడపకు తిరిగి ప్రచారం చేయాలని ఆయన అంటున్నారు. ఇప్పటిదాకా నిర్వహించిన సమావేశాలకే దిక్కులేదు.. ఇక ఇంటింటికీ తిరగడం ఎక్కడ సాధ్యమవుతుందని ఒకవైపు కార్యకర్తలు పెదవి విరుస్తుండగా.. కనీసం ఇలాటి దిశానిర్దేశం చేయడానికి కూడా ఖాళీ లేకుండా జగన్ ఏం చేస్తున్నారని నాయకులు ఆశ్చర్యపోతున్నారు.

జగన్ అధికారంలో ఉన్న కాలంలో సకల శాఖల మంత్రిగా, డీఫాక్టో ముఖ్యమంత్రిగా సర్వం చెలాయించిన సజ్జల రామక్రిష్ణారెడ్డే ఇప్పుడు జగన్ ను బైపాస్ చేసి, పార్టీ అధ్యక్షుడిగా కూడా అధికారం చెలాయించాలని అనుకుంటున్నారా అనే సందేహాలు పలువురిలో కలుగుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories