రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఒక్కటే లక్ష్యంగా చంద్రబాబునాయుడు అడుగులు వేస్తున్నారు. సింగపూర్ పర్యటనలో ఆయన కష్టానికి ఫలితం కనిపిస్తూనే ఉంది. వివిధ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఏపీలో నిర్మాణ రంగంలోను, ఫ్యాబ్రికేషన్ రంగంలోనూ పెట్టువబడులకు వేర్వేరు సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ప్రథానంగా ఫాబ్రికేషన్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థ ఎవర్సెండై కార్పొరేషన్ ఇప్పుడు ఏపీకి రాబోతోంది. పెట్టబుడులు, అమరావతి నిర్మాణం వేగవంతం కావడం పరంగా ఇది చాలా మంచి పరిణామం అని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఎవర్సెండై కార్పొరేషన్ సంస్థకు ఫాబ్రికేషన్ రంగంలో విస్తారమైన అనుభవం ఉంది. బుర్ఝ్ ఖలీఫా, పెట్రోనాస్ టవర్, చెన్నైలోని డీఎల్ఎఫ్ డౌన్ టౌన్ తారామణి ప్రాజెక్టు, గుజరాత్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఫాబ్రికేషన్ పనులన్నీ నిర్వహించిన సంస్థ ఇది.మలేసియాకు చెందిన ఈ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉంది. ఈ సంస్థ సీఎండీ తాన్శ్రీ ఎ.కె.నాథన్ సింగపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి తన ప్రతిపాదన ను ఆయన ముందు పెట్టారు.
ఏపీలో విశాఖపట్టణం లేదా కృష్ణపట్నంలలో ప్రభుత్వం ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడ రెండులక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక ఫాబ్రికేషన్ ఫ్యాక్టరీతో పాటు, సమీకృత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ సుముఖంగా ఉంది. ఇక్కడి నుంచి మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఫాబ్రికేషన్ ఉపకరణాలను రవాణా చేయడానికి సిద్దంగా ఉన్నట్టు తెలిపింది. రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కూడా భాగస్వామ్యం వహించేందుకు ఎవర్సెండై సంస్థ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తిరుపతి ఐఐటీ, శ్రీసిటీ లోని ఐఐఐటీ సంస్థలతో కలిసి స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటుపై కూడా ఈ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో చర్చించనట్టుగా వార్తలు వస్తున్నాయి.
రాష్ట్రానికి ఈ సంస్థ రావడం అనేది చాలా కీలక పురోగతి అవుతుంది. దేశవ్యాప్త ఫాబ్రికేషన్ అవసరాలను తీర్చగల సంస్థ ఏపీలో ఏర్పాటు కావడం.. పారిశ్రామికంగా మన రాష్ట్ర ప్రాధాన్యాన్ని పెంచుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
అలాగే సింగపూర్ కు చెందిన గ్లోబల్ అర్బన్ ఇన్ఫ్రా కంపెనీ సుర్బానా జురాంగ్ కూడా రాష్ట్రంలో గృహనిర్మాణ రంగంలో పెట్టబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సంస్థ ప్రతినిధి చెర్ఎక్లో.. సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్రంలో ప్రజలందరికీ ఇళ్లు నిర్మించే పథకంలో సుర్బానా సంస్థ సహకారం తీసుకుంటాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు.