ఒక రకంగా చూసినప్పుడు.. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పునరుత్థానానికి, భారత రాష్ట్ర సమితి నాయకుడు మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆడిపోసుకోవడానికి ఏదో నిరాధార ఆరోపణల జోలికి వెళ్లిన కేటీఆర్.. పర్యవసానాలను ఊహించలేకపోయారు. తెలుగుదేశం పార్టీ పునరుత్థానానికి ఆయన మాటలు దోహదం చేస్తుండగా.. ఆ పరిణామం ఆటోమేటిగ్గా భారత రాష్ట్ర సమితి పతనాన్ని కూడా నిర్దేశిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇంతకూ ఏం జరిగిందంటే.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేయడానికి, ఇక్కడి వ్యవహారాలకు ముడిపెట్టి విమర్శలు చేయడం చాలదన్నట్టుగా.. ఏపీలోని బిజెపి ఎంపీ సీఎం రమేష్ తో బంధాన్ని ముడిపెట్టి బురదచల్లే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఆయనకు నామినేషన్ పద్ధతిలో 1650 కోట్ల కాంట్రాక్టు ఇచ్చారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. దీనికి కౌంటర్ ఇచ్చిన సీఎం రమేష్.. అన్ని వివరణలు ఇచ్చారు గానీ.. ఏపీలో జగన్ కు ఉన్నట్టుగా, తెలంగాణలో కేటీఆర్ కు ఇంట్లో కుంపటి ఉన్నదని దానినుంచి ప్రజలను పక్కకు మళ్లించడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత జైల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఢిల్లీలో తన ఇంటికి వచ్చి.. కేసులు ఎత్తేయిస్తే బిజెపిలో విలీనం అవుతామని చెప్పినట్లుగా వెల్లడించారు.
అవన్నీ పక్కన పెడితే.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి-తెలుగుదేశం కలిసి పోటీచేస్తాయని భారాస భయపడుతున్నదంటూ సీఎం రమేష్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తాము సొంతంగా ఎదగాలనే అనుకుంటోంది. ఏపీలో వారికి ఏమాత్రం బలం లేదు గనుక.. ఎన్డీయే కూటమిలోకి తెలుగుదేశాన్ని కూడా తీసుకున్నారు గానీ.. ఆ మైత్రీ బంధాన్ని తెలంగాణలో కూడా కొనసాగించే ఉద్దేశం ఉన్నట్టుగా ఇప్పటిదాకా వారు ఎన్నడూ బయటపడలేదు. సీఎం రమేష్ మాటలు నిజమై.. తెలంగాణలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గానీ.. లేదా మూడేళ్లతర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గానీ బిజెపి, తెలుగుదేశం కలిసి పోటీచేస్తే వారి కలయిక భారాసకు మరణశాసనం అవుతుందని పలువురు జోస్యం చెబుతున్నారు. భారాస పరిపాలన మీద, కుటంబ వ్యవహారాల మీద ప్రజలకు ఎప్పుడో నమ్మకం సడలిపోయింది. ఇప్పుడున్న ఇంటిగొడవలు పార్టీ పరువు మరింత తీస్తున్నాయి. వారికి తిరిగి ప్రజాదరణ దక్కడం అంత సునాయాసం కాదు. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ బలపడుతోంది. ఒంటరిగా అధికారంలోకి రాగల స్థితిలో లేకపోయినా.. రాష్ట్రవ్యాస్తంగా గణనీయమైన ఓటు బ్యాంకు ఉంది. తెలుగుదేశం పార్టీకి క్షేత్ర స్థాయిలో చెక్కు చెదరని కార్యకర్తల బలం ఉంది. గెలుపు గుర్రాలను బరిలోకి దించి కాస్త గట్టి ప్రయత్నం చేస్తే కొందరైనా నెగ్గడం కష్టం కాదు. బిజెపి బలం కూడా తోడైతే తెలుగుదేశానికి పెద్ద ఎడ్వాంటేజీ అవుతుంది. మైత్రి వలన ఉభయులూ లాభపడతారు. వారి లాభం.. గులాబీలకు శాపం అవుతుంది. గులాబీదళం నుంచి అప్పటికి అనేకమంది నాయకులు సొంతగూటికి చేరుకున్నా ఆశ్చర్యం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తేనెతుట్టెను కదిపినట్టుగా కేటీఆర్ ఈ ఆలోచనను తెరపైకి తెచ్చారనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.